తెలంగాణ రాష్ట్రం ఓకే, కానీ...

2014 ఎన్నికలకు కొద్ది ముందు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఇటు తెలంగాణలో ఆ లోపు సీమాంధ్రలో వారి అభిప్రాయాలు సేకరించి వారి అభ్యంతరాలు ఏమిటి, వారికి హైదరాబాద్‌లో ఎలాంటి రక్షణ కావాలి తదితర విషయాలను చర్చించి అక్కడి వారిని ఒప్పించి తెలంగాణపై శాశ్వత నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణపై ఎలాంటి బిల్లు ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సల్ చెప్పినప్పటికీ, పార్లమెంటులోనే కేంద్రం ఈ ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గత డిసెంబరు 9 నాటి ప్రకటనకు కట్టుబడి ఉన్నామని కేంద్రం త్వరలో ప్రకటించే అవకాశమున్నట్టుగా సమాచారం. విభజనతో ముడిపడి ఉన్న అంశాల పరిష్కారానికి ప్రభుత్వం మొదట కృషి చేయాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీమాంధ్ర, తెలంగాణ వారు పట్టుబడుతున్న హైదరాబాద్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అంతర్భాగం చేస్తూ ఉమ్మడి రాజధానిగా కొంతకాలం ఉంచేందుకే కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ముందుగా వైఖరిని నిర్ణయించుకునేందుకే మల్లగుల్లాలు పడుతున్నామని హోం మంత్రి చిదంబరం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు కోర్ కమిటీ సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని మార్చిలో అఖిలపక్షానికి పిలిచే అవకాశం ఉంది.
ఇరువైపులా ఉద్వేగాలు నెలకొన్న సమయంలో, ఏకపక్షంగా ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపుతూ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల, తొలుత తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దేలా, రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ ప్రకటన రావచ్చు. దీని ద్వారా తెలంగాణలో వాతావరణాన్ని చల్లబరచాలన్నది అధిష్ఠానం ఉద్దేశం. ఆ తర్వాత విభజన ప్రక్రియలో ఉన్న అడ్డంకులపై దృష్టి సారించేందుకు వీలు చిక్కుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీమాంధఅరులకు సంతృప్తికరమైన పరిష్కారాలు కనుగొనేందుకు, ఇరు వర్గాలను సంప్రదింపులకు సన్నద్ధం చేసేందుకు అవసరమైన సమయం లభిస్తుంది.