కిరణ్, బొత్స మధ్య వంటగ్యాస్ మంట

కేంద్రం వంటగ్యాస్ ధర అదనంగా రూ. 50 పెంచడంపై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో అంతంత మాత్రంగా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం బడుగులపై పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచి మోయలేని భారం మోపడంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ సబ్సిడీని మోసే విషయంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న మీనమేషాల తీరును సొంత పార్టీ అధ్యక్షుడితోపాటు, మంత్రులకూ మింగుడు పడటంలేదు.
కేంద్ర ప్రభుత్వం డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ ధరలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా రూ. 30 కోట్ల అదనపు ఆదాయం ఖజానాకు సమరకూరుతోంది. అంటే దాదాపు ఏటా అదనంగా రూ. 360 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు వ్యాట్ రూపంలో ఆదాయం సమకూరుతోంది. తాజా పెంపులో భాగంగా వంటగ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 50 పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో అదనంగా ప్రతి నెలా రెండు కోట్ల ఆదా యం వస్తున్నది. దీంతో ఏటా వ్యాట్ ఆదా యం తాజా గ్యాస్ ధరల పెంపుతో కలుపుకొని ఇది రూ. 120 కోట్లు దాటవచ్చునని అధికారిక గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఇది రూ. 100 కోట్లుగా ఉందని రెవిన్యూ అధికారుల అంచనా. మొత్తంగా ప్రతి ఏటా పెట్రోలు,పెట్రో ఉత్ప త్తులపై వ్యాట్ ఆదాయం రూ. 8 వేల కోట్లకుపైనే నమోదవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వంటగ్యాస్‌పై బండకు రూ. 25లు చొప్పున సబ్సిడీ ప్రకటిస్తే ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు బొత్స సీఎంకు కొంతమేర నచ్చచెప్పినట్లు తెలిసింది. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స ప్రతిపాదనపై ఎంత మాత్రం సానుకూలంగా లేరని తెలుస్తోన్నది. ప్రస్తుతం గ్యాస్ బండపై రూ. 25 సబ్సిడీ ప్రకటిస్తే రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ. 300 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యకం చేస్తున్నట్లు తెలిసింది.