వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, కిరణ్: ఎవరి ఎత్తులు వారివి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-YS Jagan
ప్రస్తుతం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వ్యూహప్రతివ్యూహాల సమరం సాగుతోంది. ఎవరి ఎత్తుగడల్లో వారున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారు మాటల యుద్ధానికి దిగుతున్నారు. నైతిక విలువలు ఉంటే జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు రాజీనామా చేయాలని ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనతో వేడి పుట్టింది. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే శాసనసభ్యులు తన వెంట వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని, అంత చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ మనుగడ తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని వైయస్ జగన్ ఢిల్లీలో చేసిన ప్రకటనే ఈ సమరానికి పునాది వేసింది. ఈ మాటలతో జగన్ పైచేయి సాధించకుండా కిరణ్ కుమార్ రెడ్డి జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులకు సవాల్ విసిరారని అనుకోవాల్సి ఉంటుంది.

దమ్ముంటే తన ప్రభుత్వంపై కిరణ్ కుమార్ రెడ్డి విశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తాజాగా జగన్ వర్గం శాసనసభ్యులు సవాల్ విసిరారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్‌పై కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వారు ఆ సవాల్ చేశారు. అయితే, తనంత తానుగా కిరణ్ కుమార్ రెడ్డి బలపరీక్షకు దిగరనే విషయం అందరికీ తెలుసు. పైగా, పరిస్థితి ఎలా ఉన్నా గవర్నర్ నరసింహన్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడాలని కిరణ్ కుమార్ రెడ్డిని కోరే అవకాశాలు లేవు. వైయస్ జగన్ వర్గం అవిశ్వాసాన్ని ప్రతిపాదించే స్థితి లేదు. అదే సమయంలో తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్‌కు లేఖ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదే స్థితి వస్తే వారిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడమనేది వారి వల్ల అయ్యే పని కాదు. దీన్ని గమనించే తాము 2014 వరకు ప్రభుత్వాన్ని కూల్చదలుచుకోలేదని, తామే తలుచుకుంటే కిరణ్ ప్రభుత్వం ఉండదని బీరాలు పలుకుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఆ అవకాశాన్ని వాడుకుందామని జగన్ వర్గం భావిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో తెలుగుదేశం కుమ్మక్కయిందని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. జగన్‌కు రాజకీయాలకు ఉపయోగపడడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓ వైపు శాసనసభ్యులను బుజ్జగిస్తూనే సవాళ్లు విసురుతున్నారు. జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది. పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదనే అపవాదు నుంచి బయటపడడానికి అవకాశం లభించడమే కాకుండా బలనిరూపణకు అవసరమైన శాసససభ్యుల సంఖ్య తగ్గిపోతుంది. దాని వల్ల అనర్హత వేటు వేయకుండానే ప్రభుత్వాన్ని గట్టెక్కించుకునే అవకాశం ఉంది. ప్రజారాజ్యం, మజ్లీస్ శాసనసభ్యుల బలంతో గట్టెక్కడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరస్పరం రెచ్చగొట్టుకునే సమరాన్ని సాగిస్తున్నారు. ఈ సమరంలో ఎవరు ముందు కాలు కదుపుతారనేది చెప్పడం కష్టం. ఎవరు ముందు చర్యలకు దిగితే వారు ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. అందుకే, జగన్ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెసు నాయకత్వం, రాజీనామాలు చేయకుండా జగన్ వర్గం కాలయాపన చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X