తీరిన వైయస్ జగన్ భయం

కాగా, వైయస్ జగన్ వెంట వెళ్లే శాసనసభ్యుల సంఖ్యపై కూడా సోనియా గాంధీకి స్పష్టమైన అంచనా వచ్చేసిందని అంటున్నారు. జగన్ ఫీజు రీయంబర్స్‌మెంట్ దీక్ష విరమణ సభకు 23 మంది శాసనసభ్యులు, ఓ పార్లమెంటు సభ్యుడు హాజరయ్యారు. 23 మంది శాసనసభ్యుల్లో 19 మంది కాంగ్రెసు పార్టీకి సంబంధించినవారు. ఇద్దరు ప్రజారాజ్యం పార్టీకి, మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. వీరి వల్ల ప్రభుత్వం పడిపోయే స్థితి ఏమీ రాదు. ఈ లెక్కన చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజారాజ్యం పార్టీకి చెందిన 16 మంది శానససభ్యులతో కలుపుకుని సుస్థిరంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపు 155 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. జగన్ దీక్ష విరమణ సభకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. మరో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాలేదు. జగన్ వెంట ఎంత చూసుకున్నా వీరిద్దరు పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుత స్థితి చూస్తుంటే, శాసనసభ్యులు లేకున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా వైయస్ జగన్‌కు ప్రజల మద్దతు ఉందని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. అయితే, క్రమక్రమంగా ఆ మద్దతు కూడా తగ్గుతూ వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. ఈ స్థితిలో వైయస్ జగన్‌ను విస్మరిస్తేనే తమకు లాభం ఉంటుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. ఏమైనా, వైయస్ జగన్ సమస్య నుంచి సోనియా గాంధీ గట్టెక్కినట్లేనని చెప్పవచ్చు. తెలంగాణ సమస్య మాత్రమే ఇప్పుడు సోనియాకు కొరకరాని కొయ్యగా తయారైంది.












Click it and Unblock the Notifications