అధిష్టాం ఆదేశాలు: రంగంలోకి దిగిన కెవిపి

తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టడంతో జగన్, తెలంగాణ సమస్యల కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కెవిపికి అధిష్టానం రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ఎమ్మెల్యేలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటం గమనించదగ్గ విషయం. అందుకే అధిష్టానం కెవిపిని ప్రయోగించింది. చాలాకాలం తర్వాత కెవిపి కాంగ్రెసులో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వైయస్ మృతి తర్వాత మరీ ముఖ్యంగా రోశయ్య హయాం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర శూన్యం. ఇటీవల రాజ్యసభ సీటు కోసం ఆయన అధిష్టానం వద్ద తన వంతు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆయన కనిపించలేదు.
తాజాగా ఆయన సామర్థ్యం తెలిసిన అధిష్టానం అవిశ్వాసం ఎదుర్కొనే అంశాన్ని ఆయన భుజాల పైన కూడా పెట్టింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి ఆయన దారికి తీసుకు వస్తారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే ఆయన వచ్చీ రాగానే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కబురు పంపినట్లుగా తెలుస్తోంది. తనను వచ్చి కలుసుకోవాల్సిందిగా వారికి సూచించారట. ఇప్పటికే జగన్ వర్గం ఎమ్మెల్యేలతో సిఎం జోరుగా చర్చలు జరుపుతున్నారు. మరి కెవిపి రాకతో మరికొంత మంది జగన్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారా? లేక అధిష్టానం వ్యూహం బెడిసి కొడుతుందా? రేపు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications