వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు రాజకీయం ఔట్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడు పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు నిరాఘటంగా పాలించిన చంద్రబాబు తన పాలనా కాలంలో అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో భారీ సంస్కరణలు చేశారు. రాష్ట్రం వరకే పరిమితం అయిన హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. ఐటితో యువతకు భారీగా ఉపాది కల్పించారు. రాజకీయ ఎత్తుగడల్లో తనను మించిన వారు లేరని విపక్షాలు, విమర్శకుల చేత సైతం పొగడ్తలు అందుకున్నవాడు. ఇలా తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాల్లో, దివంగత నందమూరి తారక రామారావు తర్వాత అంత పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసి సొంత పార్టీ మాత్రమే కాకుండా ఆయన వైరి పార్టీలు కూడా సైతం జాలిపడే స్థితికి దిగజారడం శోచనీయం.

ప్రస్తుత చంద్రబాబునాయుడు పరిస్థితి చూసిన వారు నాటి రాజకీయ చాతుర్యం ఎక్కడకు పోయిందని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ, మరో వైపు జగన్, ఇంకోవైపు కుటుంబ కలహాల మధ్య బాబు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిత్యం చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటూ రెండు కళ్ల సిద్దాంతంపై ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని మరింత బలపర్చాలంటే కాంగ్రెసు కన్నా టిడిపిని ముందుగా దెబ్బతీయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకే ఆయన టిడిపిని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పలువురి మాటల్లో చెప్పాలంటే కెసిఆర్‌కు ప్రత్యేక తెలంగాణ కన్నా టిడిపి దెబ్బతీయడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిని బయటకు తీసుకు వస్తున్నారు.

ఇప్పటికే బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని టిఆర్ఎస్‌లో లాగారు. ఉప ఎన్నికల కోసం రాజీనామా చేసిన చెన్నమనేని రమేష్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అంతకుముందు రమేష్ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తదుపరి లక్ష్యంగా పాల్వాయి రాజ్యలక్ష్మిని చేసుకున్నారు. ఆమెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాబుకు తెలంగాణలో ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కష్టతరంగా మారింది. అందుకే పోచారం రాజీనామా ఆమోదానికి టిడిపి కూడా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక టిఆర్ఎస్ సంగతి అలా ఉంటే పార్టీలో ఉంటూ నాగం జనార్ధన్ రెడ్డి బాబుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. పార్టీ వీడకుండానే పార్టీని ముప్పుతిప్పలు పెడుతూ కంటిలో నలుసులా మారారు. ఇక టిడిపికి గట్టి పట్టు ఉన్న కోస్తా జిల్లాల్లో జగన్ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బాబును విమర్శిస్తూ జగన్ వెంట వెళుతున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టి బాబును అధికారంలోకి రాకుండా చేశారు. 2014లో అధికారంలోకి వద్దామనుకుంటున్న బాబుకు ఇప్పుడు జగన్ అడ్డు పడేలా కనిపిస్తున్నారు.

ఇవన్నీ సమస్యలు ఇలా ఉంటే బాబుకు ఇటీవలే మరో సమస్య పట్టుకుంది. అది వారసత్వ సమస్య. బాబు తనయుడు లోకేష్ కుమార్‌ను చంద్రబాబు హైప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఉద్దేశ్యంతో హరికృష్ణ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. హరికృష్ణ ప్రత్యక్ష యుద్దానికి దిగకుండా విజయవాడ గలాటాకు తలుపులు తెరిచారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య చల్లబడింది. అయితే సహజంగా ఆవేశ పరుడు అయిన హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎప్పుడు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తారో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో త్వరలో జరగనున్న మహానాడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహానాడుకు హరికృష్ణ రాకుంటే దూరం పెరిగిందని, వస్తే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అనే భయం పచ్చదళంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారసత్వ పోరు సద్దుమణిగినప్పటికీ తెలంగాణ, జగన్, నాగం తదితర సమస్యలు హైటెక్ సిఎంను పట్టి పీడిస్తున్నాయి. అయితే సహజంగా చాణక్య తెలివిగల చంద్రబాబు వీటన్నింటిని అధిగమించగలడని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు జూ.ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసిన సందర్భాన్ని కూడా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులో ప్రయోజం ఉంటుందని కూడా బావిస్తున్నారు.

English summary
TDP president Chandrababu Naidu facing many problems. KCR targeting TDP, family problems with Harikrishna, dissatisfaction MLAs, Ex MP YS Jaganmohan Reddy effect in Kostha and Nagam Janardhan Reddy in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X