రాజకీయ నేతలపై తెలంగాణ ఉద్యోగుల గుర్రు!

సకల జనుల సమ్మె పేరుతో ఉద్యోగులను ముందు పెట్టి తమను బలిపశువులుగా చేయవద్దని వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగుదేశం, కాంగ్రెసు తదితర పార్టీలు తెలంగాణ కోసం అంటూ మొదటి సారి రాజీనామాలు చేసినప్పటికీ మరోసారి రాజీనామాలు చేయడానికి ఆలోచిస్తుండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధులు సైతం రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తమ రాజీనామాలపై తెలుగుదేశం, కాంగ్రెసు వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఇక పైకి తెలంగాణ కోసం అంటూ రాజీనామాలు చేస్తున్నప్పటికీ పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామాల విషయంలో వారికి సీరియస్ లేనట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగులు ఎంతగా సమ్మె చేసినప్పటికీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే ఫలితం ఉంటుందని కూడా ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
సకల జనుల సమ్మె అని చెప్పినప్పటికీ ప్రభుత్వంతో సహా అన్ని వర్గాలు ఉద్యోగుల పైనే దృష్టి పెట్టడాన్ని వారిలో ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు సైతం సమ్మెలో అందరినీ దింపే ప్రయత్నాలు చేయక పోవడం అందరూ ఉద్యోగుల వైపు చూడటానికి ఆస్కారం ఏర్పడుతోందని వారు భావిస్తున్నారు. ఈ నెల 5న విద్యార్థి జెఏసి బందుకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ మద్దతు ప్రకటించడాన్ని సైతం పలువురు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. నిత్యం బందుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బందులు నిత్యం ప్రకటించడం వలన ప్రజలు వాటికి సహకరించడం లేదనే భావన వ్యక్తమవుతోంది. విద్యుత్ ఉద్యోగులు సైతం తాము సమ్మె కాకుండా రెండు గంటలు అదనంగా పని చేసి నిరసన తెలుపుతామని చెబుతున్నారు. దీని పైనా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ సహాయం తెలంగాణ వారికే కానీ సీమాంధ్రులకు కాదని ఇటు ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications