తెలంగాణ మంత్రులు: వర్క్ ఫ్రమ్ హోం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి కొద్ది మంత్రులు తప్ప చాలా మంది తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణకు చెందిన 12 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. కె. జానా రెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి మంత్రులు తమ తమ పనులను చేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా హాజరయ్యారు.
పాలనాయంత్రాంగం స్తంభించలేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. విడతలు విడతలుగా తెలంగాణకు చెందిన మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తున్నారు. తెలంగాణపై సంప్రదింపుల్లో భాగంగానే వారు ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లు చెబుతున్నప్పటికీ పాలనాపరమైన విషయాలపై కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అంతా సజావుగా జరిగిపోతోందని చెప్పడానికి ఏమీ లేదు. పాలనాపరమైన చిక్కులు ముఖ్యమంత్రికి ఎదురవుతూనే ఉన్నాయి.