జగన్‌పై హైకోర్టు తీర్పు ఎవరికి లాభం?

YS Jagan-Chandrababu Naidu
వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలలోకి ఆస్తులు ఎలా వచ్చాయో పూర్తిగా తెలవాల్సిన అవసరం ఉన్నందున పూర్తి విచారణ చేయాల్సిందేనని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అదేశించిన నేపథ్యంలో తీర్పు తమకు లాభిస్తుందంటే తమకు లాభిస్తుందని ప్రధాన పార్టీలు ఎవరికి వారే అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై తాము ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారా తమ పోరాటం నిజమైందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. తద్వారా కోర్టు తీర్పు ద్వారా తాము లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరం అయిన టిడిపి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అధికార కాంగ్రెసు పార్టీతో పాటు సీమాంధ్రలో కాంగ్రెసు, టిడిపి పార్టీలలో చిచ్చు పెడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఎదుర్కొనేందుకు టిడిపి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే మంత్రి శంకర్ రావు వేసిన పిటిషన్ తర్వాత టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి సైతం జగన్ ఆస్తులపై కోర్టును ఆశ్రయించారు.

టిడిపి పక్కా వ్యూహంతో వెళుతున్నట్లుగానే కనిపిస్తోంది. మొదట జగన్‌ను ఇరికించినప్పటికీ కాంగ్రెసును సమర్థంగా ఎదుర్కోవడానికి కాంగ్రెసు నేతలను సైతం ఇరికించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టిడిపి నేతలు అక్రమాలలో జగన్ పాత్రతో పాటు నాటి వైయస్ మంత్రివర్గానికి ఉందని చెబుతున్నారు. అక్రమాలలో వైయస్ కుటుంబం శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో కొంత శాతం తప్పకుండా మంత్రివర్గానికి ఉంటుందనేది టిడిపి వాదన. అందుకే జగన్‌తో పాటు నాటి మంత్రి వర్గాన్ని, ప్రభుత్వ అధికారులను సైతం విచారించాలనేది టిడిపి వాదన. మొదట జగన్‌ను బోనులో ఇరికించి తద్వారా కాంగ్రెసు నేతలను ఇరికించాలనేది టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది. సిబిఐ సంపూర్ణ దర్యాఫ్తులో జగన్ అక్రమాలు నిజమేనని తేలితే నాటి మంత్రివర్గాన్ని విచారించాలని టిడిపి గట్టిగా పట్టుబట్టడమే కాకుండా కోర్టుకు వెళ్లే విషయాన్ని సైతం కొట్టి పారేయలేం. తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రభుత్వ నిర్ణయాలలో మంత్రివర్గం పాత్ర కొట్టి పారేయలేం. ఇప్పటికే జాతీయస్థాయిలో కాంగ్రెసు పూర్తిగా అవినీతిలో కూరుకు పోవడం, జగన్‌కు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా జగన్ వెంట ఉన్న ప్రజారాజ్యం, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ టిడిపి గడప తొక్కక తప్పదని టిడిపి భావిస్తోంది.

ఇక వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ సైతం కోర్టు తీర్పుతో పెద్దగా ఆందోళన చెందినట్లుగా కనిపించడం లేదు. రాజకీయ నాయకులపై విచారణలు సాధారణమే అని జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అది పూర్తి దర్యాఫ్తులో తేలుతుందని చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖ తీర్పు వల్ల జగన్‌కు సానుభూతి పెరుగుతుందే తప్ప జనంలో వ్యతిరేకత పెరగదని చెప్పారు. వైయస్ చేపట్టిన పథకాలు ప్రభుత్వ పథకాలు అయినప్పటికీ అవి జగన్ ఖాతాలోకి వెళ్లడం, ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో నానిన కారణంగా జగన్ అరెస్టు చేసినా ప్రజల్లో సానుభూతి కలిగి ఓట్ల రూపంలో అది బయట పడుతుందే తప్ప పార్టీకి నష్టం లేదని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కడప ఉప ఎన్నికలలో సానుభూతి కారణంగానే జగన్ భారీ మెజార్టీతో గెలవడం విశేషం. జగన్‌ను అరెస్టు చేసినా సానుభూతి కలిగి అది పార్టీకి మరింత లాభిస్తుందనే కోణంలో వైయస్సాఆర్సీ ప్రధానంగా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ ప్రజల్లో లేకపోయే సందర్భం వస్తే అనే ముందుచూపుతో విజయమ్మకు సారథ్య బాధ్యతలు చేపట్టే దిశలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ సైతం జగన్‌ను ఇరికించడం ద్వారా తాము లబ్ధి పొందినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో ఓదార్పు ద్వారా భారీగా కాంగ్రెసు పార్టీ క్యాడర్‌ను తన వైపుకు తిప్పుకుంటున్నారు. హైకోర్టు తీర్పు ద్వారా జగన్ వైపు వెళుతున్న తమ పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవచ్చునని భావిస్తోంది. జగన్ అరెస్టయినప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తినా ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్న కారణంగా సానుభూతి పని చేయక పోవచ్చుననేది కాంగ్రెసు నేతల భావనగా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ వెంట నడవాలనుకుంటున్న యువతరంపై ఈ ప్రభావం ఉంటుందని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర్ రెడ్డి వంటి వారు జగన్‌పై ధాటిగా మాట్లాడుతున్నప్పటికీ టిడిపి వ్యాఖ్యల ద్వారా నాటి మంత్రివర్గానికి మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అయితే 'లోతు' నిర్ణయాలలో తమ పాత్ర అపరిమితం అని చెప్పడం ద్వారా జెసి దివాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వారు మంత్రివర్గాన్ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజా సంక్షేమం కోసం పెట్టిన పథకాలు వైయస్ ఒక్కడి సొంతం అని చెప్పుకుంటున్న జగన్, ఆస్తుల నిర్ణయాలలోను ఆయన ఒక్కడిదే అని ఎందుకు చెప్పడం లేదనేది కాంగ్రెసు ప్రధాన వాదన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+