జగన్ తెలుగు మీడియాను ఎందుకు వద్దన్నారు?

తనపై వచ్చిన ఆరోపణలకు జగన్ వివరణ ఇవ్వాలనుకున్నా మరేం చెప్పదల్చుకున్నా తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగు ప్రచార సాధనాలతో మాట్లాడకుండా ఇంగ్లీషు ఛానళ్లతో మాట్లాడటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై వివరణ ఇవ్వడం కన్నా కాంగ్రెసుతో లాలూచీ పడటానికే ఆయన ఆంగ్ల ప్రచార సాధనాలను ఆశ్రయించారని జగన్ వ్యాఖ్యల ద్వారానే అర్థమవుతుందని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సైతం జగన్ ఆంగ్లంలో మాట్లాడటాన్ని, భారతీయ జనతా పార్టీతో తప్ప మిగిలిన ఏ జాతీయ పార్టీకి తాము వ్యతిరేకం కాదని చెప్పడంపై తీవ్రంగా స్పందించారు. జగన్ ఆస్తులపై సిబిఐ పూర్తి విచారణ జరుగుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో బిజెపితో తప్ప మరే పార్టీకి తాము వ్యతిరేకం కాదని జగన్ చెప్పడం వల్ల ఆయన మళ్లీ కాంగ్రెసుతో కలవడానికే నిర్ణయించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో కాంగ్రెసు, బిజెపి మినహా మరే చెప్పుకోదగ్గ పార్టీలో లేవు. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం అంతంత మాత్రమే.
ఇలాంటి సమయంలో బిజెపి తప్ప అనటం కాంగ్రెసుతో కలవడానికే అని టిడిపి వంటి పార్టీలో చెబుతున్నాయి. అంతేకాదు జగన్ పార్టీ నుండి వెళ్లినప్పటి నుండి కాంగ్రెసులోని కొందరు నేతలు జగన్ తిరిగి కాంగ్రెసు గూటికి చేరతారని వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేసినట్లే జగన్ సైతం ఎప్పటికైనా కాంగ్రెసులోనే చేరతారని చెబుతూ వస్తున్నారు. తనపై జరుగుతున్న సిబిఐ దర్యాఫ్తును తప్పించుకోవడానికి జగన్ కాంగ్రెసుతో కలిసి వెళ్లినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే వారూ ఉన్నారు. అయితే జగన్ రెండు వైపులా తన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తన ఆస్తులపై హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించడం ద్వారా సుప్రీం కోర్టుకు వెళ్లడం మొదటిది. మొదట కాంగ్రెసుకు దూరంగా ఉంటూనే సిబిఐ దర్యాఫ్తు జరగకుండా చూసుకోవడం. అలా కాని పక్షంలో ఇక తప్పని పరిస్థితి ఎదురైతే కాంగ్రెసుతో వెళ్లాలని జగన్ నిర్ణయంగా ఉన్నట్లుగా తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications