జగన్ వ్యూహం బెడిసికొడుతుందా?

వైయస్ జగన్ వర్గానికి చెందిన 30 మంది శాసనసభ్యులు సభకు గైర్హాజరు కావడం ద్వారా ప్రభుత్వం మైనారిటీలో పడిందనే అభిప్రాయం కలిగించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేత ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించేలా ఒత్తిడి చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. జగన్ వర్గం శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటే అధికార కాంగ్రెసు పార్టీ బలం తగ్గుతుంది. తెలుగుదేశం సభ్యులు 83 మంది ఉన్నారు. సిపిైకి నలుగురు, సిపిఎంకు ఒకరు శాసనసభ్యులున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు 12 మంది ఉన్నారు. కాంగ్రెసుకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఓ స్వతంత్ర సభ్యుడు తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి ప్రతిపక్షంలోనే ఉన్నారు.
లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఇలా చూస్తే కాంగ్రెసుకు 127 మందికి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది శాసనసభ్యులు తోడైతే అధికార పక్షం బలం 145 ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్, మజ్లీస్ ఎమ్మెల్యేలు కలిస్తే ప్రభుత్వానికి 154 మంది సభ్యులుంటారు. ఆరుగురు సభ్యులు గైర్హాజరైతే ప్రభుత్వ మనుగడకు కావాల్సిన 148 సంఖ్యకు దిగువకు అధికార పక్షం బలం పడిపోతుంది. ఈ స్థితిలో చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదిస్తే ప్రభుత్వం పడిపోవడానికి అవకాశం ఉంటుందనేది జగన్ అంచనాగా చెబుతున్నారు. అయితే, రాజీనామా చేసిన శాసనసభ్యుల విషయం తేలితే తప్ప ప్రభుత్వ భవిష్యత్తుపై తేల్చలేని స్థితి ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications