బైపోల్స్: జగన్, బాబుకు మనుగడ, చిరుకు పరువు

ఆయా పార్టీల ముఖ్యనేతలు, సుడిగాలి పర్యటనలు, సార్వత్రిక ఎన్నికల కంటే మిన్నగా ప్రచారాలు చూస్తుంటే ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో పాటు పురంధేశ్వరి, గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి తదితరులు ఎందరో కాంగ్రెసు తరఫున ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు తరఫున వైయస్ జగన్, షర్మిళ, వైయస్ విజయమ్మ జోరుగా ప్రచారం చేశారు. టిడిపి తరఫున నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు.
నేతలు మండుటెండల్లో సైతం ఎడతెరిపి లేకుండా తిరిగారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి విషమ పరీక్ష. ఇప్పటి వరకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్నా.. వాటిని ప్రాంతీయ సెంటిమెంట్‌తో ముడిపెట్టి తేలిగ్గా తీసుకుంది. ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికికే సవాల్ ఎదురైంది. పార్టీ నుంచి వెళ్లిపోయి, వేరు కుంపటి పెట్టుకుని, తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలను తీసుకెళ్లి జగన్ విసిరిన సవాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికే కాదు.. ఆ పార్టీ ఢిల్లీ పెద్దలకూ పరీక్షే అని చెప్పవచ్చు.
ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో ఆళ్లగడ్డ మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ ఖాతాలోనివే. వారంతా హస్తం గుర్తుపై గెలిచినవారే. పార్టీని బేఖాతర్ చేసి వెళ్లిపోయిన వారే. వారంతా మళ్లీ గెలిస్తే.. అధికార కాంగ్రెస్‌కు భారీ కుదుపు తప్పదు. కాంగ్రెస్‌ను నమ్ముకునే కంటే జగన్ వెంట వెళితే భవిష్యత్తు భద్రమనే నమ్మకం పెరిగిపోయి మరికొందరు జారుకునే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే కిరణ్ సర్కార్ పుట్టి మునుగుతుంది.
అంతేనా.. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, రాష్ట్రంలో ఆ పార్టీ తమిళనాడు కాంగ్రెస్ తరహాలో ఉనికి కోల్పోతుందన్న వాదనలూ షికారు చేస్తున్నాయి. ప్రత్యేక వాదం, వరుస ఉప ఎన్నికల్లో పరాజయం తదితరాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాలుగా దెబ్బతింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పలు కేసుల్లో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దెబ్బ మీద దెబ్బలా ఈ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు.
అధికార కాంగ్రెస్‌కే కాదు.. జగన్‌కూ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత వచ్చిన అసలైన సవాల్ ఇది. కడప, పులివెందులలో గెలవడం ఒక ఎత్తు.. ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావడం మరో ఎత్తు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించారు. తల్లి, సోదరి రూపంలో బ్రహ్మాస్త్రంతోపాటు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించినా ఇప్పుడు వారందరినీ గెలిపించుకోలేకపోతే జగన్ నాయకత్వం డోలాయమానంలో పడుతుంది. ఆయనను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న అభద్రత భావం నెలకొంటుంది.
ఆ పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్న వారు పునరాలోచనలో పడతారు. వలసలకు చెక్ పడుతుంది. వీటికితోడు, సిబిఐ కేసుల ఉచ్చు ఉండనే ఉంది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో నాలుగైదు చోట్ల ఓడినా.. జగన్ నాయకత్వంపై సందేహాలు ముసురుకుంటాయి. అందుకే ఈ ఎన్నికలు జగన్‌కు చావోరేవో అన్న భావన ఉంది. టిడిపికి కూడా ఈ ఎన్నికలు సవాలే. జగన్ పార్టీ బలపడితే టిడిపికి కూడా కష్టకాలమే. అధికార కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది. దాని ఓటుబ్యాంకు కూడా అదే స్థాయిలో చీలిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత నెలకొంది.
ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో టిడిపి నిలదొక్కుకోవడం కష్టమేనన్న భావన ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న మొత్తం 18 స్థానాల్లో ఏ ఒక్కటీ టిడిపికి సంబంధించినవి కాదు. అయినా.. అటు జగన్, ఇటు కాంగ్రెస్‌లు అవినీతి ఊబిలో కూరుకుపోయి పెను వివాదంలో చిక్కుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఫలితాలు సాధించకపోతే చంద్రబాబు నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం 18 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలోనే పోటీ చేస్తున్నా.. టిఆర్ఎస్‌కు కూడా ఇది జీవన్మరణ సమస్య.
తెలంగాణ మొత్తం మీద ఒక్క పరకాలలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టిఆర్ఎస్ స్థానం కాదు. కాంగ్రెస్ తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొండా సురేఖ అనర్హత కారణంగా వచ్చిన ఎన్నిక. ఈ కోణంలో చూస్తే.. ఇది కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ. కానీ, ఇది తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నిక. జగన్ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగింది. ఇటీవలి ఎన్నికల్లో పాలమూరులో ఓడిపోవడం టిఆర్ఎస్‌కు మింగుడు పడడం లేదు. పాలమూరు పరాభవానికి తోడు పరకాలలోనూ ఓడిపోతే తెలంగాణలో ఆ పార్టీ తలెత్తుకు తిరగడం కష్టమే.
పాలమూరు ఊపుతో తెలంగాణ చాంపియన్ హోదాను కైవసం చేసుకునేందుకు బిజెపి కూడా రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చినా.. ఈ ఎన్నికల్లో బిజెపి, కొండా సురేఖ దీటుగా పోటీ ఇస్తున్నారు. ఇక్కడ బిజెపి గెలవకుంటే పాలమూరు గెలుపు గాలివాటం అనే వాదనలు వినిపిస్తాయి. కాబట్టి పరకాలలో గెలుపు బిజెపికి అత్యంత ముఖ్యం. అయితే ఈ పార్టీకి మాత్రం పెద్దగా నచ్చే నష్టమేమీ లేదు.
వ్యక్తిగతంగా చూసుకుంటే తిరుపతి నియోజకవర్గం చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చాలా ప్రతిష్టాత్మకం. నిన్నటి వరకు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న చిరు తన అభ్యర్థిని గెలిపించుకోవాల్సి ఉంది. ఇక కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు. కొండా సురేఖకు పరకాల గెలుపు ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ ప్రాంతంలో పాగా వేయాలంటే సురేఖ గెలుపే ముఖ్యం.
కొండా సురేఖ ఇక్కడ ఓడితే కష్ట కాలమే అంటున్నారు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెసు ఇప్పటి వరకు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బోణీ కోసం చూస్తున్న వైయస్సార్ కాంగ్రెసు ఓడితే ఆ ప్రాంతంలో కాలుమోపడం భవిష్యత్తులో మరింత కష్టమవుతుందని అంటున్నారు. ఇప్పుడు గెలిస్తేనే భవిష్యత్తు బావుంటుందని అంటున్నారు. మొత్తానికి ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.












Click it and Unblock the Notifications