బాలయ్య ఎపిసోడ్, చిరంజీవి పదును

చిరంజీవి ఆరితేరిన రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ బాలకృష్ణవి చిన్నపిల్లాడి మాటలని, చిన్నపిల్లల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. ఆ తర్వాతి బాలకృష్ణ వ్యాఖ్యలకు కూడా ఆయన అనుభవం జోడించి మాట్లాడినట్లు కనిపిస్తున్నారు. చిరంజీవిపైనా పోటీ చేస్తానని బాలకృష్ణ సవాల్ చేశారు. దానికి కూడా చిరంజీవి పెద్దగా రెచ్చిపోలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి మీదనైనా పోటీ చేయవచ్చునని, బాలకృష్ణ వ్యాఖ్యల్లో తప్పు లేదని ఆయన చెప్పారు. అలాగే, అభిమానుల మధ్య ఘర్షణ వాతారవరణంపై కూడా చిరంజీవి హుందాగానే వ్యవహరించారు. ఘర్షణలకు దిగవద్దని తన అభిమానులకు చెప్తానని, అభిమానులు రెచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
బాలకృష్ణ, చిరంజీవి స్టార్ వార్‌లో చిరంజీవి పైచేయి సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపన, ఆ తర్వాత కాంగ్రెసులో విలీనం, ఇప్పుడు కాంగ్రెసు నాయకుల సలహాలు చిరంజీవిని రాటు దేలించాయని అంటున్నారు. రాజకీయాల్లో ఎంత వరకు మాట్లాడాలో, ఎంత వరకు మాట్లాడకూడదో ఆయన నేర్చుకున్నట్లే ఉన్నారు. బాలకృష్ణకు కూడా అలా రాటు దేలడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడానికి మాత్రమే బాలకృష్ణ అలా మాట్లాడారని, రాజకీయ పరిపక్వత లేకకాదని అంటున్నారు. ఏమైనా, బాలకృష్ణ, చిరంజీవి వారికి వారే సాటి.












Click it and Unblock the Notifications