• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2జి నుండి జగన్ కేసు వరకు: ఎదురు దెబ్బలు

By Srinivas
|

A Raja-YS Jagan
యుపిఏ-2 ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. యుపిఏ-1 ప్రభుత్వం కాస్త సాఫీగా సాగినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ భారీ కుంభకోణాలలో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రం చెప్పినట్లుగా సిబిఐ నడుచుకుంటుందనే వాదన ఉన్నప్పటికీ ఏ కుంభకోణాన్ని తరిచి చూసినా కాంగ్రెసు లేదా ఆ పార్టీ మిత్రపక్షాల నేతల పాత్రను దర్యాఫ్తు సంస్థలు బయటపెడుతున్నాయి.

స్వయంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల మీదే అవినీతి ఆరోపణలు రావడం... వాటిపై సిబిఐ విచారణలు ప్రారంభం కావడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల గానీ, కాగ్ లేవనెత్తిన అంశాలు గానీ, సిబిఐ స్వయంగా చేపట్టిన విచారణలు గానీ.. ఏవైనా యూపీఏ రెండో విడత పాలనలో కాంగ్రెస్ అవినీతి వేళ్లు మరింత విస్తరించినట్లు కనిపిస్తోంది. 34 మంది కేంద్ర మంత్రుల్లో 15 మందిపై కోట్లాది రూపాయలకు సంబంధించిన అవినీతి ఆరోపణలున్నాయి.

కేంద్రంలోనే కాక, కాంగ్రెస్ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో కూడా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు సిబిఐ విచారణల్లో ఉన్నారు.యుపిఏ-2 పాలనలో ప్రపంచంలో మరే దేశంలో లేనంతగా అవినీతి విస్తరించిందని తేలింది. అందుకే సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే సంస్థ అయినా పలువురు మంత్రులు సైతం సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నారు. బొగ్గు కేటాయింపుల కుంభకోణం జరిగిన సమయంలో, అంటే 2006-09 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ సింగ్ అధీనంలో ఉందని, అందువల్ల బొగ్గు కేటాయింపుల కుంభకోణానికి ఆయన కూడా బాధ్యుడవుతారని అన్నా హజారే బృందం ఆరోపించింది.

కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ సైతం అవినీతికి పాల్పడినట్లు ఆ బృందం ఆరోపించింది. ఆయన రక్షణ మంత్రిగా ఉండగా స్కార్పియన్ జలాంతర్గాముల ఒప్పందంలో 4 శాతం ముడుపులు తీసుకున్నట్టు తెలిపింది. 2జీ కేసులో చిదంబరం, ఇంకా.. పలు కేసుల్లో శరద్ పవార్, ఎస్ఎం కృష్ణ, కమల్‌నాథ్, ప్రఫుల్ పటేల్, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, జికె వాసన్, ఫారూఖ్ అబ్దుల్లా, ఎంకె అళగిరి, సుశీల్ కుమార్ షిండే, వీర భద్రసింగ్ లాంటివారు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

వీరిలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే ఆదర్శ్ హౌసింగ్‌లో ముడుపులు తీసుకుని ఇళ్లు కేటాయించినట్టు వారిద్దరి మీదా సిబిఐ కేసులు పెట్టింది. అయినా వారి మంత్రి పదవులకు ఢోకా రాలేదు. నిజానికి నేర, అవినీతి చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. కానీ, వారికి శిక్ష పడినప్పుడే అది వర్తిస్తుంది. మన దేశంలో ఓ అవినీతి కేసులో విచారణ పూర్తయి శిక్ష పడడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. ఈ జాప్యమే అవినీతిపరులకు వరంగా మారుతోంది.

2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడోత్సవాలు నిర్వహించినప్పుడు వాటి నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు అటు కాగ్, ఇటు సిబిఐ ఆరోపించాయి. ఇది దాదాపు రూ. 70 వేల కోట్ల కుంభకోణం. ఢిల్లీ హ్యాట్రిక్ సిఎం షీలా దీక్షిత్ కూడా ఇందులో అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ పేర్కొంది. జార్ఖండ్ సిఎంగా ఉన్న సమయంలో మధుకోడా రూ.50 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్టు సిబిఐ ఆరోపించింది. గనుల లీజులలో కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది.

ఇక కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా 2009 ప్రాంతంలో దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సిబిఐ పేర్కొంది. ఎయిర్‌ సెల్‌ను మలేసియా పారిశ్రామికవేత్త టి.అనంతకృష్ణన్‌కు అమ్మేయాలని అప్పట్లో ఆ సంస్థ అధినేతపై దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ విపరీతంగా ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించింది. అందుకు ప్రతిగా కళానిధి మారన్‌కు చెందిన సన్ నెట్‌వర్క్‌లో అనంత కృష్ణన్ రూ. 800 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తెలిపింది.

మారన్, ఆ తర్వాత ఆ పదవి చేపట్టిన రాజా 2జీ స్కాంలో కోట్లాది రూపాయల మేర అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ఇది సుమారు 1.76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ఇదే కేసులో యూపిఏ భాగస్వామ్య పక్షం డిఎంకె అధినేత కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళిపై కూడా సిబిఐ చార్జిషీటు దాఖలు చేసి ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది. ఇక మన రాష్ట్రంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

వైయస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టుకున్నాక.. ఆయన అక్రమ ఆస్తుల వ్యవహారంపై సిబిఐ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. వైయస్ హయాంలో క్విడ్ ప్రో కో ప్రాతిపదికన అనేక అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకున్నట్టు సిబిఐ భావిస్తోంది. వైయస్ హయాంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం, స్థలాల మంజూరుపై కూడా ఆరోపణలు రావడంతో సిబిఐ విచారణ చేపట్టింది.

వాన్‌పిక్‌కు తొలుత మంజూరు చేసిన భూమికంటే మరింత ఎక్కువ భూమిని కేటాయించినట్టు తేలడంతో సిబిఐ వాటిమీద కూడా విచారణ చేపట్టింది. ఇందులో జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులకు ఉన్న ప్రమేయంపై సిబిఐ ఆరా తీసింది. ఫలితంగా మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లగా...ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. అది ఆమోదించాల్సి ఉంది. మరో నలుగురు మంత్రులు కూడా జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్నారు.

English summary
Telecom, urea, VANPIC, Adarsh etc scams are revealed under UPA-2 government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X