రాయల 'తెలంగాణ' హీట్: పనిలో పనిగా సిఎం...

ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. అంత మాత్రాన తెలంగాణ అంశానికి, నాయకత్వ మార్పునకు ముడిపెడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన.. సీమాంధ్రుల కుట్ర అని, దీనికి అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం మండిపడ్డారు. ఆ ప్రతిపాదన తెస్తున్న నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని కోరారు. త్వరలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.
ఇటీవలే రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తెచ్చామని, సోనియాను కలిసి రాష్ట్ర ఆవశ్యకతను వివరించామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణకు సానుకూలంగా కేంద్రం ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరునూరైనా త్వరలోనే తెలంగాణ వచ్చి తీరుతుందని, సీమాంధ్ర నేతలు అడ్డుపడినా ఆగదని ఎంపి సిరిసిల్ల రాజయ్య స్పష్టం చేశారు.
జూలై 15 తర్వాత రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరుగుతాయని సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. అప్పుడు పార్టీ ప్రక్షాళన, మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. 2009 డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్న తర్వాత ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని, అందుకే ఉప ఎన్నికల్లో పరాభవం తప్పలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి తెలిపారు.
రాష్ట్ర పరిస్థితులు, ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి మార్పుపై కూడా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే దీనిపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయన్నారు. అయితే రాయల తెలంగాణ ఏర్పడుతుందంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలేనని చెప్పారు. సున్నితమైన ఈ అంశంపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించడం ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టడమేనని మాజీ హోం మంత్రి, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా త్వరగా రాష్ట్ర విభజన చేపట్టాలని కోరారు. ఆంధ్రా ప్రజలు కూడా విభజన కోరుకుంటున్నారని, ఉప ఎన్నికలలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు.












Click it and Unblock the Notifications