పురంధేశ్వరి వర్సెస్ కావూరి: రేణుకాచౌదరి వ్యాఖ్య

పురంధేశ్వరిపై ఉన్న వ్యతిరేకత రేణుకా చౌదరి ఆదివారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా వ్యక్తమైంది. పురంధేశ్వరిని వ్యతిరేకించడానికి ఆమె కావూరి సాంబశివరావును సమర్థించారని అంటున్నారు. ముప్పయి ఏళ్లుగా లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి దక్కకపోవడం బాధాకరమని, కావూరికి అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని రేణుకా చౌదరి అన్నారు.
అంతేకాకుండా, పురంధేశ్వరిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీకి పురంధేశ్వరి చేసిందేమీ లేదని, ఎన్టీఆర్ కూతురిగానే ఆమెకు గుర్తింపు ఉందని అన్నారు. అదే సమయంలో పురంధేశ్వరికి, తనకు మధ్య ఏ విధమైన పోటీ లేదని కూడా అంటూనే చెప్పాల్సిన విషయాలను చెప్పారు. తాను తెలంగాణకు చెందిన నాయకురాలిని అని, పురంధేశ్వరి ఆంధ్ర నాయకురాలని, అందువల్ల తమ మధ్య పోటీకి అవకాశమే లేదని ఆమె అన్నారు.
కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని రేణుకా చౌదరి అన్నారు. గుంటూరు లోకసభ సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చాలా కాలంగా ఇదే మాట అంటున్నారు. పార్టీని దశాబ్దాల తరబడి అంటి పెట్టుకగుని ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అన్యాయం జరుగుతోందనే భావన బలంగానే ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.
కాగా, తనకు ప్రమోషన్ రాకపోవడాన్ని వివాదంగా మార్చవద్దని పురంధేశ్వరి అన్నారు. తనకు కేటాయించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ బాధ్యతలను ఆమె సోమవారం స్వీకరిస్తూ ఆ విధంగా అన్నారు. ఇచ్చిన పని చేసుకుని పోవడానికి మాత్రమే తాను ప్రాధాన్యం ఇస్తానని, తనపై పెట్టిన బాధ్యతలను నిర్వహించడమే తన విధి అని ఆమె అన్నారు. రాజకీయ అనివార్యతల కారణంగా ఎన్టీఆర్ కూతురుకు పదవి కట్టబెట్టడం కాంగ్రెసు అధిష్టానానికి అనివార్యంగా మారిందని అంటున్నారు. అందువల్లే పురంధేశ్వరికి మంత్రి పదవి ఇచ్చి, కుల సమీకరణాలు దెబ్బ తినకుండా ఉండడానికి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications