స్థానిక ఎన్నికల్లో కూటమి కొత్త వ్యూహాలు - పార్టీలు.. సీట్ల లెక్కలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. దసరా తరువాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. ఇక.. కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసి కట్టుగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీలు.. పోటీ చేసే సీట్ల పైనా ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు చేయాలని నిర్ణయించారు.
ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం.. ఎన్నికల సంఘం సిద్దం అవుతున్నాయి. అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికల పైన నిర్ణయం ఉంటుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. అందులో భాగంగా కూటమి పార్టీలు స్థానిక ఎన్నికలకు సమాయత్తం అయ్యే క్రమంలో సమన్వయం అవసరమని గుర్తించారు. దీంతో.. మూడు పార్టీల నేతలతో కూటమి సమన్వయ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే వారంల లోగా అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

క్షేత్ర స్థాయిలో కమిటీల నియామకం
రాష్ట్రంలోని దాదాపు 100 మున్సిపాల్టీలకు ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో, వాటిపై దృష్టి సారించాలని.. క్షేత్ర స్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలి.. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది పూర్తిగా సమిష్టిగా నిర్ణయాలు ఉండాలని.. ఫలితం సైతం ఏకపక్షంగా ఉండేలా పని చేయాలని నిర్ణయించారు. అధినాయకుల స్థాయిలో మంచి సమన్వయం ఉన్నా.. క్షేత్రస్థాయిలో అది ప్రతిబింబించడం లేదని, దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూటమి నేతలు చర్చించారు. ముందుగా.. పార్లమెంటు లేదా జిల్లా స్థాయిలో ఓ కమిటీ అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కమిటీలో మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్‌చార్జు లు సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతను ఈ కమిటీలు తీసుకునేలా ప్రతిపాదించారు. సీట్ల కేటాయింపు పై ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications