స్కీమ్స్: వైయస్ ఇమేజ్‌కు కిరణ్ రెడ్డి ఎసరు

Kiran Kumar Reddy - YS Rajasekhar Reddy
హైదరాబాద్: సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డిని మరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రూపాయికి కిలోబియ్యం పథకం నుంచి ఇందిరమ్మ అమృతహస్తం పథకం వరకు అలాంటి ప్రయత్నమే కనిపిస్తోంది. ఎస్టీఎస్టీ సబ్ ప్లాన్ ఇందులో అత్యంత ముఖ్యమైంది. ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తూ తన పథకాలపై ప్రచారం సాగించుకుంటున్నారు.

దానికితోడు, వైయస్ రాజశేఖర రెడ్డిపై పరోక్ష విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించలేదని, ఆ బకాయిలు కూడా తానే చెల్లించానని చెప్పుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమలు చేసిన పథకాలు తమవేనని, వాటిని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

మొదటిసారి విపరీతమైన సంక్షేమ పథకాలు అమలు చేసి, ఆర్థిక వ్యవస్థను డీలా పడేసిన వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి పెద్దగా హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. పావలావడ్డీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వంటి తన పథకాలకు వేల కోట్లలో బకాయిలు పడ్డారు. 2008-2009లో 1100 కోట్ల రూపాయలు, 2009-2010లో 1200 కోట్ల రూపాయల సర్‌చార్జి భారం ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. ప్రతినెలా 5500 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు చెల్లిస్తున్నారు.

వైయస్, రోశయ్య ప్రభుత్వ హయాంల్లో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలే 5260 కోట్ల రూపాయలు ఉండగా వాటిని విడుదల చేశారు. మెుత్తం 8300 కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించారు. దాంతో విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలకు దిగడం లేదు.

పావలా వడ్డీ విషయంలోనూ అదే జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 400 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారు. కరవు, వరదల్లో దెబ్బతిన్న రైతులకు 4389 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించారు. 3 ఏళ్లలో 15 లక్షల మందికి ప్రైవేట్‌ ఉద్యోగాలు కల్పించేందుకు రాజీవ్‌ యువ కిరణాలు ప్రవేశపెట్టడం, 1,16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం, రాష్ట్రంలో 2.25 కోట్ల కుటుంబాలకు కిలో రూపాయికే బియ్యం పథకం అమలు చేయడం, రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ స్థాయి జీవవైవిధ్యసదస్సు నిర్వహించడం వంటి అంశాలతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు.

రాష్ట్రంలో 22 జిల్లాల్లో 10 లక్షల ఎకరాల కుటుంబాల అభివృద్ధి కోసం కిరణ్‌ వచ్చిన తర్వాత కొత్తగా ప్రారంభించిన ఇందిర జలప్రభ కొత్త పథకానికి 1,838 కోట్ల ఖర్చు చేశారు. రచ్చబండలో 24 లక్షలతో తెల్ల రేషన్‌కార్డులు ఇవ్వడం, రెండేళ్లలో 5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం, 6 లక్షలమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం, ప్రధానంగా మహిళలకు స్ర్తీ నిధి కింద ప్రత్యేక బ్యాంకు, వడ్డీలేని రుణాలు ప్రకటించడం, రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని పంటరుణాల వంటి కార్యక్రమాలను ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.

పాల ఉత్పత్తిని పెంచేందుకు 6 వేల కోట్లతో స్టేట్‌ మిల్క్‌ మిషన్‌ వంటి నూతన పథకాలు ప్రవేశపెట్టడం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపకారవేతనాల కోసం 25.49 లక్షలమందికి 8,810.69 కోట్ల ఖర్చు చేయడం, ఉచిత విద్యుత్‌ పథకం కింద 1250 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేయడం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 14.09 లక్షల ఆపరేషన్లు నిర్వహించడం, జాతీయ ఉపాథి హామీ పథకం కింద 1.24 కోట్ల జాబ్‌ కార్డుల జారీ చేయడం వంటి విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు 2313 కోట్ల ఖర్చు పెట్డడం ద్వారా ప్రజలు వైఎస్‌ను శాశ్వతంగా మర్చిపోయి, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే ఇవన్నీ అమలుచేస్తుందని చెప్పడం ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డిని తెరమరుగు చేసేందుకు కిరణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ రకంగా వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు కొత్త రూపం ఇస్తూ, కొత్త పథకాలను ప్రకటిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.

పైగా, శానససభ, పార్లమెంటు జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోనే వస్తాయనే ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెసును గట్టెక్కించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించానే మాట వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+