ys jagan ysr congress ys vijayamma kvp ramachandra rao వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు వైయస్ విజయమ్మ కెవిపి రామచంద్ర రావు
విజయమ్మ, కెవిపి: జగన్‌కు బాబు సవాల్

రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర పైన ఓ పుస్తకం ఆవిష్కరించారు. దీనికి మోతీలాల్ వోరా లాంటి ముఖ్యనేతలు వచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి లేకుండా వోరా లాంటి సీనియర్ నేత, అంతమంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎలా వస్తారని టిడిపిలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ - జగన మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని, దానికి ఈ కార్యక్రమం నిదర్శనమని, ఈ విషయాన్ని కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టిడిపి నేతలు భావిస్తున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబుతో శనివారం పలువురు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్ిభంగా కెవిపి ఢిల్లీలో నిర్వహించిన పుస్తకావిష్కరణ, విజయమ్మ వ్యాఖ్యల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైయస్ పాదయాత్రపై పుస్తకం వేసినవారు ఆయన పరిపాలనపై మాత్రం ఎందుకు వేయలేదని నేతలు ఈ సందర్భంగా అన్నారు. వైయస్ హయాంలో అవినీతి జరిగిందని సిబిఐ చెబుతోందని, ఆయన కారణంగా పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులు, మంత్రులు జైళ్లకు వెళ్లారని, ఈ విషయాలను కాంగ్రెసు అధిష్టానం ఎందుకు విస్మరిస్తోందని టిడిపిలో చర్చకు వచ్చింది.
వైయస్ విజయమ్మ కూడా కాంగ్రెసులో విలీనమయ్యే అంశాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారని, అది బయటకు చెప్పడంతో విమర్శలు వస్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని మళ్లీ ఆ వ్యాఖ్యలను ఖండించారని టిడిపి నేతలు భావిస్తున్నారు. పుస్తకావిష్కరణ, విజయమ్మ వ్యాఖ్యలతో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసులు ఒక అవగాహనతో వెళ్తున్నాయనేది స్పష్టమైందని, దీనిని బాగా వినియోగించుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కూడా గతంలో వలె వేగంగా లేదని, క్రమంగా విచారణ నెమ్మదించిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు, జగన్ పార్టీలు కలిసి తమ పార్టీనే లక్ష్యంగా చేసుకున్నాయని, ఏకమై వారు చేస్తున్న కుయుక్తులను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తే టిడిపికి ఢోకా ఉండదని టిడిపి నేతలు భావిస్తున్నారు.