నెలలో ఏం తేలనుంది: బాబుపై కెసిఆర్ ప్రీ ప్లాన్?

గతంలోలా కాకుండా కేంద్రం ఈసారి తెలంగాణ సమస్యను పరిష్కరించే ఆలోచనలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే షిండే చెప్పినట్లుగా నెల రోజుల్లో కాకపోయినా కొద్దిగా అటు ఇటు సమస్యను మాత్రం పరిష్కరించే ఆలోచనలో మాత్రం ఉన్నట్లుగా అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు వెబ్ సైట్ ద్వారా వచ్చిన గందరగోళాన్ని కూడా కేంద్రం వెంటనే తెరదంచింది. దీంతో సమస్య పరిష్కారానికి అంతర్గతంగా సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.
ఇరు ప్రాంత ప్రజలలో ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదంటున్నారు.
కేంద్రం నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని, రాష్ట్రం నూటికి నూరు శాతం విడిపోదని చెబుతున్నారు. ఇరు ప్రాంతాల నేతల వ్యాఖ్యలను బట్టి కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలను బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్యాకేజీలు వంటి వాటిని టి నేతలు వద్దని ఖరాఖండిగా చెబుతున్నారు.
ఇంకోవైపు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అఖిల పక్ష భేటీ తర్వాత టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలను టార్గెట్ చేయాలని ముందుగానే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తాము 2008 లేఖకు కట్టుబడి ఉన్నామని, కేంద్రం తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని చెప్పారు. అదే సమయంలో అదో రోజు రాత్రి కరీంనగర్ జిల్లాలో తాము తెలంగాణకు సానుకూలమని బహిరంగంగా ప్రకటించారు.
ఇంత చెప్పినప్పటికీ టిడిపిని టార్గెట్‌గా చేసుకోవడాన్ని తెరాస మానుకోలేదు. అఖిల పక్ష భేటీలో టిడిపి వైఖరి స్పష్టంగా ఉందని సిపిఐ, సిపిఎం, కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పారు. ఎప్పుడూ బాబును విమర్శించే బిజెపి ఈసారి ఆయన గురించి మాట్లాడలేదు. కానీ కెసిఆర్ మాత్రం బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి, కాంగ్రెసులపై మండిపడ్డారు. కెసిఆర్ తీరు చూస్తుంటే వారిపై మాటల దాడి చేయాలని ముందే ప్లాన్ తయారు చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications