వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: గవర్నర్ చేతిలో ధర్మాన 'విచారణ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narasimhan - Dharmana Prasad Rao
ప్రాసిక్యూషన్‌కు మంత్రి ధర్మాన ప్రసాద రావును అనుమతించాలా లేదా అనే విషయం ఇప్పుడు గవర్నర్ చేతిలో పడనుంది. ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలంటూ సిబిఐ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర కేబినెట్ తిరస్కరించిన విషయం తెలిసింది. ఇది ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం వెళ్లనుంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనకు శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మినహా మిగిలిన వారంతా అంగీకరించారు.

ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఒక మంత్రి డిసెంట్ తెలుపడం విశేషం. మంత్రిని సిబిఐ ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ రాజ్‌భవన్ ముందుకు ఫైలు వెళ్లడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. కేబినెట్ తీర్మానం, తనను ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదో వివరిస్తూ ధర్మాన పంపిన నోట్, దీనిపై ప్రభుత్వ వాదనలతో కూడిన ఫైలు ఒకటి రెండు రోజుల్లో రాజ్ భవన్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి కేసు మన రాష్ట్రంలో మొదటిసారే. గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ కూడా మంత్రి బాలకృష్ణ పిళ్లై ప్రాసిక్యూషన్‌కు నిరాకరిస్తూ రాజ్‌భవన్‌కు ప్రతిపాదన పంపారు. గుజరాత్‌లో 400 కోట్ల ఫిషింగ్ కుంభకోణానికి సంబంధించి మంత్రి పురుషోత్తం సోలంకి ప్రాసిక్యూషన్‌కు అనుమతిని ఇవ్వవద్దంటూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనను గవర్నర్ కమలా బెనివాల్ తిరస్కరించారు.

గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోలంకి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రాజ్‌భవన్ నిర్ణయాన్నే హైకోర్టు సమర్థించింది. అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ దర్యాప్తు సంస్థ స్పష్టంగా పేరున్న నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌కు ఎందుకు వెనుకాడుతున్నారంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం నాటి మంత్రివర్గ సమావేశంలో మంత్రి డిఎల్ ఈ అంశాలనే ప్రస్తావించారు.

వీటిని పరిగణనలోకి తీసుకోకుండా, న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటూ ముఖ్యమంత్రి ప్రతిపాదనను వ్యతిరేకించారు. వెనుకబడిన వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ విషయంలో ఒకలా, ధర్మాన విషయంలో ఒకలా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే ప్రభుత్వంపై స్వపక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ పంపనున్న ఫైలును ఆమోదించవద్దంటూ గవర్నర్‌ను కోరేందుకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ధర్మాన కూడా ఉన్నారు. సుప్రీం కోర్టులో దాదాపు ఇదే అంశానికి సంబంధించి వేరే కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో గవర్నర్ నరసింహన్ కేబినెట్ తీర్మానంపై ఎలా స్పందిస్తారోననే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైళ్లపై యథాలాపంగా సంతకాలు చేయకుండా గవర్నర్ నరసింహన్ తనదైన శైలిలో నిర్ణయాలను తీసుకుంటున్న సందర్భాలు మనం ఇటీవల చూశాం. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో నిక్కచ్చిగా వ్యవహరించారు. ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ విసి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని తెలిసిన వెంటనే ఫైలును వెనక్కు తెప్పించుకున్నారు.

English summary

 Will the Andhra Pradesh governor ESL Narasimhan accept the cabinet decision on Dharmana Prasad Rao issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X