జగన్ పార్టీ విజయం: సింపతీ ఫ్యాక్టరేనా?

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదు వచ్చిన యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆజాద్ కూడా హైదరాబాదు వచ్చారు. తమ పార్టీ ఉప ఎన్నికల్లో తగిన స్థానాలకు గెలుచుకోలేకపోవడంపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్ జగన్ అరెస్టు వల్ల సానుభూతి వెల్లువెత్తిందని, ప్రచారంలోకి వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల దిగడం వల్ల సానుభూతి మరింత పెరిగిందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. వైయస్ విజయమ్మ కన్నీళ్లే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టాయని విజయవాడ కాంగ్రెసు పార్లమెటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వంటి పలువురు నాయకులు అదే వాదన చేస్తున్నారు. ఒక రకంగా ఈ వాదన ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి కాస్తా ఓదార్పు పొందడానికి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడానికి పనికి వచ్చిందనే చెప్పాలి. పార్టీ బలంగానే ఉందని చెప్పుకోవడానికి కూడా వీలైంది. రెండు స్థానాల్లో తమ పార్టీ గెలవడం కూడా ఒక రకంగా కాంగ్రెసు పార్టీని కాస్తా కాపాడినట్లే చెప్పాలి.
అయితే, నిజానికి పరిస్థితి కాంగ్రెసు నాయకులు చెప్పినంత సూటిగా లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు సానుభూతి కొంత మేరకు ఉపయోగపడి ఉండవచ్చు గానీ నిర్మాణపరంగా, ఆదరణపరంగా కాంగ్రెసు పరిస్థితి దిగదిడుపుగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానం అంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చింది. ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే పొందగలిగింది.
వైయస్ జగన్ అవినీతి పెద్దగా ప్రజలకు పట్టలేదు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రియంబర్స్‌మెంట్, 108 సర్వీసుల సేవలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడ్డాయి. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు ఎవరనే ప్రశ్న జనాల నుంచి వస్తూనే వైయస్ జగన్ తిన్నా కూడా తమకు వైయస్ రాజశేఖర రెడ్డి కొంత మేలు చేశారనే అభిప్రాయం వస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే వైయస్ జగన్ కూడా తమకు మేలు చేస్తారని వారు ఆశిస్తున్నారు. ఏ మేలు చేయని రాజకీయ నాయకుల కన్నా ఏదో మేరకు మేలు చేసే రాజకీయ నాయకుడు తమకు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ రకంగా చూసినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పథకాలేనని, సోనియా చెప్పడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పథకాలను అమలు చేశారని కాంగ్రెసు నాయకులు ఎంతగా చెప్పినా ఫలితం ఉండకపోవచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, సమన్వయలోపం కూడా కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయవచ్చు. ఏమైనా, సింపతీ ఫ్యాక్టర్ పేరుతో కాంగ్రెసు పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడానికి వీలు లేని పరిస్థితే ఇప్పుడు నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications