సాక్షిపై ఫైర్: వైయస్సార్ బాటలో చంద్రబాబు

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రికను, రాధాకృష్ణకు చెందిన ఆంధ్రజ్యోతి దినపత్రికను పదే పదే తప్పు పట్టేవారు. ఆ పత్రికలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. తెలుగుదేశం పార్టీకి ఆ పత్రికలు బాకా ఊదుతున్నాయని మండిపడేవారు. అదే తరహాలో చంద్రబాబు నాయుడు సాక్షి దినపత్రికపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాను కార్పోరేట్ వలలో చిక్కుకున్నట్లు సాక్షి మీడియా ఇచ్చిన వార్తాకథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
తాను కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని సాక్షి దినపత్రికలో పదే పదే వార్తలు వస్తుండడం చంద్రబాబుకు గిట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా అదే రకమైన విమర్శలు చేస్తున్నారు. ఈ స్థితిలో సాక్షి మీడియాపై ధ్వజమెత్తడానికి నిర్ణయించుకున్నారు. అయితే, చంద్రబాబు నేరుగా సాక్షి మీడియాపై విరుచుకుపడడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అలా వ్యాఖ్యలు చేయడం వల్ల సాక్షి మీడియాకు ప్రాధాన్యం పెరుగుతుందని, చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నట్లవుతుందని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.
పార్టీకి చెందిన వేరే నాయకులతో సాక్షి మీడియాతో మాట్లాడిస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే, సాక్షి మీడియా అంత పెద్ద యెత్తున ప్రచారం సాగిస్తుంటే చంద్రబాబు మాట్లాడడమే మంచిదని అంటూ గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై మాట్లాడిన విషయాన్ని మరి కొంత మంది గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియాకు దీటుగా, వాటిని ఢీకొట్టడానికే సాక్షి మీడియాను ఉద్దేశించారు. కాంగ్రెసుకు ఆ మీడియా మద్దతుగా నిలుస్తుందని భావించారు. కానీ, కథ అడ్డం తిరిగి వైయస్ జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడంతో కాంగ్రెసుకు మీడియా లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications