డెడ్‌లైన్: కెసిఆర్ వలలో పడేదెవరు?

ఈ నెల 27న తెరాస ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు నాటికి పార్టీలోకి ఎంత మంది వస్తే అంత మంది సిట్టింగులకు టిక్కెట్లు గ్యారంటీగా ఇస్తానని, అందుకు పూచీ తనదేనని కెసిఆర్ చెబుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా కేసీఆర్ గత కొద్ది రోజులుగా వలసలను ప్రొత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంగుల కమాలకర్ మాత్రమే తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నారు.
ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను ఎప్పుడెప్పుడు తమ పార్టీలోకి లాగేసుకుందామా అని ఎదురు చూస్తున్న కెసిఆర్‌కు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నుంచి గానీ తెలుగుదేశం నాయకుల నుంచి గానీ ఆయనకు ఏ విధమైన సంకేతాలు అందలేదు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, రాజయ్య, వివేక్ తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు వారి నుంచి కూడా ఏ విధమైన సమాచారం లేదని అన్నారు.
గంగుల కమాలకర్‌తో పాటు తెలుగుదేశం శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూడా తెరాసలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, ఆ సూచనలేవీ కనిపించడం లేదు. సమయానికి కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావైనా చేరుతారా, లేదా అనేది చూడాల్సిందే. తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు అధిష్టానం కళ్లెం వేసినట్లు తెలుస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో వారు తెరాసలోకి వెళ్లే ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications