బాబు కేబినెట్లో బిజెపి: ఎప్పుడనే దానిపై డైలమా
కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో చేరాలనే విషయమై బిజెపిలో చర్చ సాగుతోంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఈ నెల 8న (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఏడెనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
తన కేబినెట్లో చేరాలని చంద్రబాబు బిజెపికి సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో టిడిపి చేరిన విషయం తెలిసిందే. అశోక్ గజపతి రాజు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. త్వరలో జరిగే విస్తరణలో సుజనా చౌదరికి అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపిని చంద్రబాబు తన కేబినెట్లోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నుండి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. కేబినెట్లో వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నారు.

బిజెపి అగ్రనేతలకు చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు చర్చిస్తున్నారు. బాబు కేబినెట్లో చేరాలా లేదా అనే విషయమై ఆదివారం చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రి వెంకయ్య వచ్చారు. ఆదివారం వెంకయ్య, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
బిజెపి కేబినెట్లో చేరితే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు చోటు దక్కే అవకాశముంది. శ్రీనివాస్ గతంలో టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. అదే సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతోను మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస్ బిజెపిలో చేరకముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. తమ కేబినెట్లో చేరాలని టిడిపి ఆహ్వానిస్తోందని, ఎప్పుడు చేరాలో తామింకా నిర్ణయం తీసుకోలేదని, జూన్ 8న తాము తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంభంపాటి హరిబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications