వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ పోరు : మోదీ - షా జోడీ ప్రతిష్ఠ ప్లస్ రాహుల్ నాయకత్వానికి సవాల్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా పరిణమించింది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రజాదరణకు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ చాతుర్యానికి పరీక్షగా మారాయి. వారిద్దరి పోల్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యానికి పెద్ద పరీక్షగా మారింది. ఇద్దరూ ఇదే రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందున.. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేలా వ్యూహాలు రచించటం సవాల్‌ లాంటిదే. ఇక 22 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు, బీజేపీ కూడా పట్టుతప్పకుండా వీలైనన్ని మార్గాల్లో ముందుకెళ్తోంది.

ఇందుకు తగ్గట్లే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇటు బీజేపీలోనూ, అటు విపక్షాల నుంచి వీరి జోడీకి చిక్కులు తప్పవు. దీంతోపాటుగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నానికి బలం చేకూరినట్లవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు గుజరాత్‌ అసెంబ్లీ పోరు సెమీఫైనల్స్‌ వంటిదని పరిశీలకులు భావిస్తున్నారు.

 పాటిదార్ల రిజర్వేషన్ ఆందోళన ఇలా ఎఫెక్ట్

పాటిదార్ల రిజర్వేషన్ ఆందోళన ఇలా ఎఫెక్ట్

మోదీ సర్కార్ చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక ఆర్థిక నిర్ణయాలు గుజరాత్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. హిందూత్వ రాజకీయాలకు బీజేపీకి పరిశోధనశాలగా మారిన గుజరాత్‌లో ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ పటేల్ నేతృత్వంలోని పాటిదార్లు విద్యాఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాలంటూ రోడ్డెక్కారు. దీనివల్ల పటేల్‌ వర్గం తనకు దూరమవుతుందన్న బెంగ బీజేపీకి ఏర్పడింది. అయితే పటేళ్లను రాజకీయంగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీతో హార్దిక్‌ అంటకాగడంతో పాస్‌ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ప్రభుత్వం పట్ల పాటిదార్లలో ఏర్పడిన వ్యతిరేకత రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న బీజేపీ అవకాశాలను దెబ్బతీయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఐదోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ ముందుగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోదీ భూమి పుత్రుడు అన్న సెంటిమెంట్ తమకు ఓట్లు తెచ్చిపెట్టగలదని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు వేలకోట్ల రూపాయల పథకాలను ప్రధాని ఇటీవల ప్రారంభించారు. అభివృద్ధే తమను ఎన్నికల్లో గెలిపిస్తుందని, ఈ సారి 150 సీట్లు గెలువాలన్నదే తమ లక్ష్యమని సీఎం విజయ్‌రూపానీ చెప్పారు.

 150 స్థానాలు లక్ష్యంగా అమిత్ షా వ్యూహం

150 స్థానాలు లక్ష్యంగా అమిత్ షా వ్యూహం

అందుకే రెండు నెలల్లో మోదీ ఆరుసార్లు గుజరాత్‌లో పర్యటించారు. కుల, హిందుత్వ అంశాలకంటే వ్యాపారులను ఆకట్టుకోవటం, అభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గత నెలలలో జపాన్‌ ప్రధాని షింజో అబేను గుజరాత్‌కు తీసుకొచ్చి బుల్లెట్‌ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే సౌరాష్ట్ర ప్రాంతానికి మేలు జరిగే.. ఫెర్రీ సర్వీసునూ మోదీ ప్రారంభించారు. మరోవైపు, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా క్షేత్రస్థాయిలో పనిచేసుకుపోతున్నారు. 30వేల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఆయన నియమించారు. ఈసారి 150 స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో దూసుకుపోతున్నారు. మోదీలాగే గుజరాత్‌లోని ప్రతిమూలపైనా అమిత్‌షాకు పట్టు ఉన్నది. అందుకే ఏయే ప్రాంతాల్లో పట్టుకోసం ఏమేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. దీనికి అనుగుణంగానే రెండ్రోజుల క్రితం కార్పొరేషన్‌లు, పలు సంస్థల చైర్మన్ల నియామకంలో కీలక భూమిక పోషించారు. బీజేపీ అంతర్గత సర్వేలోనూ జీఎస్టీ, నోట్లరద్దుతో వ్యాపార వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలింది. దీంతో ఈ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 పరిణతి చెందిన నేతగా రాహుల్ క్యాంపెయిన్

పరిణతి చెందిన నేతగా రాహుల్ క్యాంపెయిన్

అటు, గుజరాత్‌లో అధికారానికి 22 ఏళ్లుగా దూరంగా ఉన్న కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలనే కృతనిశ్చయంతో ఉంది. నాయకత్వ స్థానానికి ఎదిగిన అనంతరం పార్టీకి వరుసగా ఓటములే తెచ్చిపెడుతున్నాడన్న అపప్రథను మూటగట్టుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్ ఎన్నికలు మరో పరీక్షగా నిలువనున్నాయి. దీంతో ఆయన గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. మునుపటికన్నా పరిణతి చెందిన నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. గత నెల రోజుల్లో ఆయన ఆరు రోజులు గుజరాత్‌లో గడిపారు. ముస్లింలను బుజ్జగించే పార్టీ కాంగ్రెస్ అన్న బీజేపీ ఆరోపణను తిప్పికొట్టేందుకు గుజరాత్‌కు వచ్చిన ప్రతిసారి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌ సహా వివిధ వర్గాల నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవటంతో వైదొలిగిన మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలాకు ప్రత్యామ్నాయం కనిపించడంలో హస్తం పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌కూ గుజరాత్‌లో ప్రజాదరణ ఉన్న నేతలెవరూ లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నడిపించే నాయకత్వం లేదు. అందుకే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా విమర్శలు చేయటంపైనే దృష్టిపెట్టింది. జీఎస్టీ, నోట్లరద్దు కారణంగా దేశ ఆర్థికప్రగతి కుంటుపడిందని విమర్శిస్తోంది. వ్యాపారుల్లో బీజేపీపై అసంతృప్తిని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ వ్యూహ కమిటీ పనిచేస్తోంది. కుల రాజకీయాలపైనే దృష్టిపెట్టి సోషల్‌ ఇంజనీరింగ్‌పై ప్రత్యేకంగా పనిచేస్తోంది. బీజేపీ విజయ్‌ రూపానీనే తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించగా.. కాంగ్రెస్‌ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

 ఎన్నికల్లో విజయానికి పంచ సూత్రాలు

ఎన్నికల్లో విజయానికి పంచ సూత్రాలు

తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో మూడేళ్లుగా పటేళ్లు ఆందోళన చేస్తున్నారు. ఈ సామాజిక వర్గం అభివృద్ధి కోసం గత నెలలో ప్రభుత్వం ఓ కమిషన్‌, మరో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా వారిలో సంత్రుప్తి కలిగించలేదు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కోసం తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయిన వస్తు సేవలపన్ను (జీఎస్టీ) అమలు తీరుపై బీజేపీ మద్దతుదార్లయిన చిన్న, మధ్య తరహా వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. వస్త్ర పరిశ్రమపై విధించిన ఐదుశాతం పన్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక నర్మదా నదిపై నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ గుజరాతీల మనోభావాలతో ముడిపడి ఉంది. ఆనకట్ట ప్రారంభమైనా పంట కాలువల పనులు పూర్తి కాలేదని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ఉద్యోగాల కోసం మూడేళ్లుగా రాష్ట్రంలో యువకులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల పనితీరు బాగున్నా, తగినన్ని ఉద్యోగాల కల్పన జరగడం లేదన్న వాదన ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తాత్కాలిక ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, క్లర్కులు వంటి సిబ్బంది గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. కొందరు జీతాలు పెంచాలని కోరుతుండగా, మరికొందరు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 బీజేపీకి శివసేన చురకలు

బీజేపీకి శివసేన చురకలు

గుజరాత్ అభివ్రుద్ధి నమునాపై బీజేపీకి దాని మిత్రపక్షం శివసేన పార్టీ చురకలు అంటించింది. అభివృద్ధికి నమూనా గుజరాత్ అని చెప్పుకొంటున్న బీజేపీ.. ఆ అభివృద్ధి వాస్తవమైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజలపై వరాలు ఎందుకు గుప్పిస్తున్నదని ప్రశ్నించింది. గుజరాత్‌లో 15 ఏండ్లుగా అభివృద్ధి పనులు జరిగితే ప్రచారం లేకుండానే గెలువొచ్చని ఎద్దేవా చేసింది. అభివృద్ధికి నమూనా గుజరాత్ నిజమైతే.. ఎన్నికల ముందు ఈ ప్రోత్సాహక ప్రకటనలు అవసరం లేదు అని శివసేన పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్నది. ప్రధాని మోదీ సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు రాష్ర్టాన్ని సందర్శించారని చెప్పింది. గుజరాత్‌లో విజయం సులువు కాదని తెలుసుగనుకే.. మోదీ ఆపసోపాలు పడుతున్నారని తెలిపింది. పటేళ్ల ఉద్యమ కార్యకర్త ఒకరికి బీజేపీలో చేరితే రూ.కోటి ఇస్తానని ప్రకటించిన అంశాన్ని సైతం శివసేన ప్రస్తావించింది.

 బీజేపీకి మరింత కష్టమన్న హార్దిక్

బీజేపీకి మరింత కష్టమన్న హార్దిక్

పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌పై వీస్‌నగర్‌లోని ఒక కోర్టు బెయిల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను జారీ చేసింది. పటేళ్ల రిజర్వేషన్ ఆందోళనల సందర్భంగా 2015లో బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కార్యాలయం ధ్వంసమైన కేసులో హార్దిక్ పటేల్ నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో వరుసగా రెండుసార్లు ఆయన కోర్టుకు హాజరు కానందుకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తున్నట్టు వీస్‌నగర్ సెషన్స్ కోర్టు తెలిపింది. ఊపిరి సలపని పనుల్లో నిమగ్నమై ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలని హార్దిక్ పటేల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే తాను అరెస్ట్ కావడానికి సిద్ధమని, అదే జరిగితే అధికార బీజేపీకి మరిన్ని కష్టాలు తప్పవని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు.

English summary
Victory is certain, the Gujarat elections shall be about winning 150 seats, Bharatiya Janata Party chief Amit Shah had said, addressing a rally in Junagarh in June this year. However, as the elections near, this target no longer seems easy for the BJP to achieve. As political tides take a new turn every day, the BJP seems to be in an uncomfortable position in the state it has ruled for two decades. In mid-October this year, Dalit leader Jignesh Mevani, Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel, and OBC leader Alpesh Thakor, appeared together for an interview for the first time in a programme organised by a national channel. The three youth leaders took the platform to declare an ‘anti-right wing’ front. Mevani claimed that the three of them could together make a dent in 120 out of the 182 assembly seats. The trio later found itself in the midst of the BJP-Congress face off in poll-bound Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X