ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు పడిపోవడంతో రైతు ఆగ్రహించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు కుట్ర కోణం కనిపిస్తున్నది.

ఈ ఘటనకు రెండు రోజుల ముందే ఓరుగల్లు వేదికగా అధికార టీఆర్ఎస్ నిర్వహించుకున్న 'ప్రగతి నివేదన' సభను రైతు జైత్రయాత్రగా అభివర్ణించిన ఘనత ఆ పార్టీ అధినేత , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది.

ఒక పార్టీకి అధినేతగా, అందునా అధికారంలో ఉండగా రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ప్రకటించడం.. ప్రజానీకాన్ని తమ వైపు ర్యాలీ చేసుకోవడానికి ప్రయత్నించడం సబబే. కానీ అదే సమయంలో ఆరు గాలం కష్టపడి, అప్పూసప్పూ చేసి, ఎండనక, వాననక కష్ట నష్టాలకు ఓర్చి, సంక్లిష్ట పరిస్థితుల మధ్య పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే నాణ్యత లేదని వ్యాపారులు సర్టిఫికెట్ ఇచ్చి రూ.3000లకు మించి కొనుగోలు చేయబోమని చెప్పడం ఏలిన వారికి సరైన నిర్ణయంగా కనిపిస్తున్నదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

కేవలం ప్రభుత్వాధికారులు, నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వాధినేతలు వాస్తవాల నిర్ధారణకు పూనుకుంటే రైతులు, కష్ట జీవులు, సామాన్యుల కడగళ్లు ప్రభుత్వానికి తెలిసే మార్గమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఖమ్మం మార్కెట్ యార్డులో కావాలని కుట్ర చేసి హింసాత్మక వాతావరణం నెలకొల్పారన్న ఆరోపణ వెనుక రైతుల సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న తమ పాలనను, అధికారాన్ని ప్రశ్నిస్తారా? అన్న ఆగ్రహం కనిపిస్తున్నదని రాజకీయ విమర్శకుల మాటగా భావిస్తున్నారు. క్వింటాల్ మిర్చి ధర ఎకాఏకీన రూ.10వేలు తగ్గితే రైతు మనస్సు ఎంత క్షోభిస్తుందో అనుభవిస్తే గానీ తెలియదు.

kcr

కుట్ర పూరితం పేరిట రైతుపై ఎదురు దాడి

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోపాటు 'ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతుల ఆందోళన' కుట్ర పూరితమని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు కుట్ర పూరితంగా వ్యవహరించాయని ఆయనా సర్టిఫికెట్ ఇస్తూనే 'మిర్చి రైతుల' ధరపై సమస్య ఉన్నదని అంగీకరించారు.

దీన్ని బట్టే అన్నదాత ఆగ్రహంలో అర్థం ఉన్నదని భావించవచ్చు. కానీ కనీస మద్దతు ధర ప్రకటించాల్సింది కేంద్రమేనని ఆయన కూడా వాదిస్తున్నారు.నిజమే కేంద్రమే వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. ప్రస్తుత సమస్యకు దీనికి పరిష్కార మార్గం కూడా చూపిందే. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మిర్చి కొనుగోలు చేయమని సూచిస్తూ తర్వాత తమ వాటా నిధులు విడుదల చేస్తామని కేంద్రం తెలిపిందే.

నిజంగా రైతుల పక్షపాతిగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేసి ఉండేది. ఒకవేళ ఆ పని చేసిన తర్వాత కేంద్రం తన వాటా నిధులు విడుదల చేయకపోతే వివక్ష ప్రదర్శిస్తున్నదంటూ విపక్షాలతో కలిసి ముందుకు సాగితే సమస్య పరిష్కారానికి మార్గం సుగమం కాదా? అన్న సందేహం వ్యక్తం అవుతున్నది. ఇక మరో సంశయం కూడా ఉన్నది.

తమతోపాటు విపక్షాలకు కూడా క్రెడిట్ రావద్దన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. రాష్ట్ర రైతాంగం సమస్యలతో సతమతం అవుతుంటే, వాటిపై చర్చించేందుకు అవకాశం లేదని ఆదివారం 'భూ సేకరణ చట్టం - 2017' సవరణ బిల్లు ఆమోదానికే పరిమితమని శనివారం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో చెప్పడాన్ని బట్టే రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అవగతమవుతూనే ఉన్నది.

వాస్తవాలు విస్మరిస్తే ప్రతికూల ఫలితాలు

ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. సహచర ఎమ్మెల్యే మరో మాటలో చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్లో అందరితో సమానంగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయన తాబేదారులే కుట్రకు తెర తీశారని మరో వ్యాఖ్య చేశారు.

కానీ వాస్తవాలు విస్మరించి విపక్షాలపై విమర్శలు చేయడం మానుకుని, కీలక సమస్యల విషయంలో పరిష్కారం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోవడం విజ్నులకు హితవైన పని అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేకించి ఖమ్మం మార్కెట్ యార్డు ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తర్వాత తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. క్రుష్ణా, గుంటూరు జిల్లాల్లోని సమీప ప్రాంతాల రైతులు కూడా ఖమ్మం మార్కెట్‌కు మిర్చి తరలించిన వారిలో ఉన్నారు. వారు ఏడాది పొడవునా కష్ట పడితే తప్ప పంట చేతికి రాదన్న సంగతి అందరికీ తెలిసిన సత్యమే.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరో మాట అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మిర్చి ఎక్కువ పండించారని, అవును కాలం సరిగ్గా ఉంటే పంటల దిగుబడి కూడా బాగానే ఉంటుంది. ఇతర రాష్ట్రాల గురించి ప్రస్తావనేలా? మన రాష్ట్రం - మన ప్రభుత్వం - మన ప్రజలు అన్న నినాదాన్ని తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల రైతుల గురించి మాట్లాడటమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

డెల్టాకు నీరు సరే మిర్చి రైతుల కడగళ్ల మాటేమిటి

గతంలో రైతుల నోటికాడ పంట ఆగం కావద్దనే నాగార్జున సాగర్‌ నుంచి క్రుష్ణా డెల్టాకు రబీ సీజన్ లో నీరు విడుదల చేశామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన రైతైనా బాధ ఒక్కటే.

ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని ఏ రైతైనా కోరుకుంటారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి తీవ్రతను గమనించి క్వింటాల్‌కు రూ.1500 చొప్పున వెచ్చిస్తూ రైతును ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలంగాణ ప్రభుత్వానికి తెలియదని భావించాలా? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నదని భావించాలా? అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కేంద్రం వైఖరి సరే.. పత్తి, ఉల్లి మాదిరే మిర్చి కొనుగోలు చేయరా?

కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్న మాట వాస్తవమే? వాణిజ్య పంటగా, రైతుల కడగళ్లు తీర్చే మిర్చి పంట ధర తగ్గితే ఆగ్రహిస్తే, కన్నీరు పెడితే ఏలిన వారికి శుభ పరిణామంగా కనిపిస్తున్నదా? 2014 నుంచి ప్రతియేటా ఏ ప్రాతిపదికన పత్తికి కనీస గరిష్ఠ ధర చెల్లించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)తో కేంద్రాల ద్వారా ఎందుకు కొనుగోళ్లు చేయించినట్లు? దాని కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అనునిత్యం సమీక్షలతో పరిస్థితిని నియంత్రించారు.

ఇక గత ఏడాది ఉల్లి కొరత నివారణకు అధిక దిగుబడి పండించాలని పిలుపునిచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం. తీరా పంట మార్కెట్ కు వస్తే కనీస ధర పలుకక రైతులు హతాశులయ్యారు. దీంతో కిలోకు 8 చొప్పున ప్రత్యేక కేంద్రాల్లో కొనుగోలుకు చర్యలు తీసుకున్నప్పుడు ఏ కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా కొనుగోలు చేశారో చెప్పగలరా? అంటే ఏలిన వారి అభీష్ఠానికి అనుగుణంగా అన్నదాతలు పంటలు పండించాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందులు బాగా పండించాలని పిలుపునిచ్చిన పాలకులే.. భారీగా దిగుబడి వస్తే మొక్కుబడిగా కనిష్ఠ మద్దతు ధర ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాణిజ్య పంటగా పేరొందిన మిర్చి కొనుగోళ్లపై ఇప్పుడు మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థలను పురమాయించే అవకాశాలు ఉన్నా, ఎందుకు ఆ పని చేయడం లేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandra Shekhar Rao & his cabinet minister Tummala Nageswar Rao suggested that conspiracy here in Khammam Mirchi farmers agitation

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి