44 కాంగ్రెస్‌కి గొప్పే: ఎపి విభజన మేలు చేసిందట!
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. బిజెపి, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాలో ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకుపోయింది. ఏ రాష్ట్రంలోని కనీసం రెండెంకెల స్థానాలను గెలుచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ 44 సీట్లకే పరిమితమైంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాంగ్రెసు పార్టీని కాపాడిందని, విభజన కారణంగా ఆ మాత్రం సీట్లు వచ్చాయని, లేదంటే 22 సీట్లకు పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి కనిపించలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పదేళ్లుగా కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం ఉందని, ఈ పదేళ్లలో పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని, కాంగ్రెసు పార్టీ ప్రతిష్టను పూర్తిగా మసకబార్చాయని చెబుతున్నారు. 2జి, బొగ్గు కేటాయింపుల్లో లక్షల కోట్ల కుంభకాణాలు వెలుగులోకి వచ్చాయని, ఇలా లెక్కలు వేస్తే ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని చెబుతున్నారు.
చివరి పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన పైన రగడ సాగడం కాంగ్రెసు పార్టీకి మేలు జరిగిందని అంటున్నారు. ఎపి విభజన అంశం లేకుంటే.. కుంభకోణాల పైన విస్తృతంగా చర్చ జరిగి ఉండేదని, అప్పుడు ఆ పార్టీ ఇప్పుడు వచ్చిన 44 కంటే తక్కువ స్థానాలకే పరిమితమయ్యేదని, ఆ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెసు పార్టీకి మేలే చేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయానికి విభజన సాకుగా దొరికిందని, మిగతా కుంభకోణాలు అన్నీ వెనుకబడ్డాయని అంటున్నారు. సీమాంధ్రలో విభజన కారణంగా ఓడిపోయామని, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర క్రెడిట్ తెరాస ఎగురేసుకు పోయిందని చెప్పుకునేందుకు అవకాశం దొరికిందని, కుంభకోణాలు చర్చకు రాకుండా పోయాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications