Array
ప్రపంచంలో అతి పెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్‌బుక్‌లో నమోదైన రామోజీ ఫిల్మ్‌సిటీ వెనుక పదిహేను సంవత్సరాల కృషి ఉంది. దాదాపు పదహారు వందల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఫిల్మ్‌సిటీలో రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పచ్చిక బయళ్ళు, అడవులు, శిలలు, శిల్పాలు ఉన్నాయి. నిర్మాతలు స్క్రిప్టుతో లోపలికి వచ్చి, రీలుతో బయటకు వెళ్ళవచ్చని, సినిమా నిర్మాణానికి సంబంధించినవన్నీ సింగిల్ విండోలో లభిస్తాయని ఫిల్మ్‌సిటీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతుంటారు. డబ్బంతా బండరాళ్ళలో తగలేస్తున్నారని ఆక్షేపణలు వచ్చినా రామోజీరావు పట్టుదలతో ఫిల్మ్‌సిటీని భూతల స్వర్గంలా అభివృద్ధి చేశారు. హిందీ, దక్షిణభారత చిత్రాలే కాకుండా విదేశీ చిత్రాలను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈటీవీ అన్నిభాషల ఛానల్స్, ఈనాడు జర్నలిజం స్కూలు ఫిల్మ్‌సిటీలోనే ఉన్నాయి. ఫిల్మ్‌సిటీలో ఉన్న ఒక పెద్ద కొండపై విశాలమైన భవనాన్ని నిర్మించుకుని రామోజీరావు అక్కడే ఉంటున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి రావడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సినీ ప్రముఖులు హర్షం ప్రకటించారు.
దక్షిణాఫ్రికాలో చంద్రముఖి క్రేజ్
ర జనీకాంత్ చంద్రముఖి దక్షిణాఫ్రికాలో సంచలనం సృష్టిస్తోంది. తమిళ భాష అర్ధం కాకపోయినా అక్కడి వారు రజనీకాంత్ నటనకు దాసోహమంటున్నారు. మొదట దక్షిణాఫ్రికాకు ఒక ప్రింటు మాత్రమే పంపారు. వారం తిరిగేలోపే ఇంకా ప్రింట్లు కావాలంటూ ఇండెంట్‌లు వచ్చాయి. దక్షిణాఫ్రికా భాషల్లోకి దీనిని డబ్ చేసి విడుదల చేయడానికి నిర్మాత ప్రభు సన్నాహాలు చేస్తున్నారు. జపాన్‌లో కూడా చంద్రముఖి క్రేజ్ నడుస్తోంది. రజనీకాంత్ నటన అంటే అక్కడివారికి వేలం వెర్రి. బాబా సినిమా ఇక్కడ దారుణంగా ఫ్లాప్ అయినా జపాన్‌లో బాగా ఆడడం విశేషం. ఒక్కోసారి భాష రాకపోవడం కూడా వరమవుతుందేమో.
భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేసినప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు విజయశాంతి. ఆ పార్టీతో ఆమెకున్న అనుబంధం అటువంటిది. ఎన్డీయే అధికారంలో ఉండగా ఆమెకు అనేక ఫేవర్లు లభించాయి. బిజెపి నుంచి విడిపోయి తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్న విజయశాంతికి ఒక పార్టీ పెట్టి నడపడం అంత తేలిక కాదని తెలిసిపోయింది. ఇప్పుడు బిజెపి టిడిపితో తెంచుకుని తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నందువల్ల ఆమె ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళిపోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
