మెగాస్టార్ చిరంజీవికి, రాజశేఖర్ మధ్య గొడవకు కారణం వేరే ఉందట. తెలుగు సినీ పరిశ్రమ రెండు విడిపోయిన విషయం రాజశేఖర్ పై దాడితో మరోసారి బయట పడింది. నిరుడు జనవరి 28వ తేదీన మోహన్ బాబు, చిరంజీవిల మధ్య లెజెండ్, సెలిబ్రిటీల వివాదం తెలుగు సినీ పరిశ్రమను ఊపేసింది. తాజాగా ఈ ఏడాది జనవరి 28వ తేదీన్నే రాజశేఖర్ పై చిరంజీవి అభిమానులు దాడి చేయడం, చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి రావడం మరో వివాదానికి కారణమైంది. రాజశేఖర్ చిరంజీవిపై చేసిన ప్రకటన ఆషామాషీగా చేసిందేమీ కాదు. ఠాగూర్ సినిమానే ఇద్దరు నటుల మధ్య మనస్పర్థలకు దారి తీసిందట. మగాడు, అంకుశం వంటి సినిమాల్లో యాంగ్రీ యంగ్ మన్ పాత్రలు పోషించిన రాజశేఖర్ తమిళంలో హిట్టయిన రమణ సినిమా హక్కులను కొనుక్కోవాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా ఆయన తమిళ నిర్మాతకు కొంత అడ్వాన్సు కూడా ఇచ్చాడని సమాచారం. అయితే చిరంజీవి మనషులు రంగంలోకి దిగి ఆ సినిమా హక్కులను రాజశేఖర్ చేతిలోంచి లాగుకున్నంత పని చేశారని వినికిడి. కనీసం తనతో మాట్లాడనైనా మాట్లాడకుండా చిరంజీవి క్యాంపు రంగంలోకి దిగి రమణ హక్కులు కొనేసుకున్నారని రాజశేఖర్ అన్నారు. చిరంజీవి హీరోగా రమణ చిత్రం తెలుగులో ఠాగూర్ గా వచ్చి విజయం సాధించింది. అదే సమయంలో సామాజిక సమస్యల పట్ల నిబద్ధతను కూడా చిరంజీవి చాటుకున్నట్లయింది. దీంతో చిరంజీవి అంటే రాజశేఖర్ మండిపడడం మొదలైందట.