తాను తెలంగాణకు ఏదో మేలు చేయాలనుకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం లేవనెత్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చిదంబరం ప్రకటించిన మరుక్షణం అందుకు తీవ్ర వ్యతిరేకత తెలిపి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తొలి నాయకుడు రాజగోపాలే. రాజగోపాల్ తనను కలుసుకోకుండా నేరుగా స్పీకరుకు రాజీనామా లేఖను పంపడం సోనియాకు ఆగ్రహం కలిగించినట్టుంది. దీక్ష కోసం లగడపాటి హైదరాబాద్ రావడం, అరెస్టు కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితి చోటుచేసుకుంది.
రాజగోపాల్ బాటలో మరికొందరు ఆంధ్రా, సీమ ఎంపీలు ధిక్కార స్వరం విన్పిస్తారని భయపడుతున్న సోనియా వారిని పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను మంత్రులకు అప్పగించవలసిందిగా సోనియాగాంధీ రోశయ్యను ఆదేశించినట్టు చెబుతున్నారు. మొడితనానికి మారుపేరైన లగడపాటి రాజగోపాల్ తన రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశం లేదు. విజయవాడ లోక్ సభ స్ధానం ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్ధితి కన్పిస్తోంది. "ఆంధ్రా బెబ్బులి"గా పేరుతెచ్చుకుంటున్న రాజగోపాల్ ఇండిపెండెంట్ గా నైనా విజయవాడ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి