రెండు తెలుగు టీవీ చానెళ్లు ఇటీవలి కాలంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ఊదరగొడుతున్నాయి. సాక్షి టీవీ చానెల్ కన్నా ముందుకు వెళ్లి అవి బాకా వాయిస్తున్నాయి. ఇదేమిటో అర్థం కాక చాలా మంది గుడ్లు తేలేశారు. కానీ, అందులోని రహస్యమేమిటో తెలిసిన వారు అది అంతేలే అని పెదవి విరిచారు. ఎన్టీవీ, టీవీ5 చానెళ్లు జగన్ ఓదార్పు యాత్రకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయని చాలా మంది అంటున్నారు. జగన్ వార్తలను ఫోకస్ చేయడంలో పోటీ పడుతున్నాయని కూడా అంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హత్యకు కుట్ర జరిగిందంటూ ఓ నకిలీ వెబ్ సైట్ వార్తాకథనాన్ని ప్రసారం చేసి టీవీ5 చానెల్ ప్రతినిధులు కేసులను ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఆ వార్తాకథనం సాక్షిలో కన్నా ముందు టీవీ5లో వచ్చింది. టీవీ5లో వచ్చిన కొద్ది సేపటికే ఎన్టీవి దాన్ని అందుకుంది. ఇదంతా వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావుల మహిమ అని గిట్టని వారు ఆడిపోసుకుంటున్నారు. ఆ రెండు టీవీ చానెళ్లలో వారిద్దరు పెట్టుబడులు పెట్టారట. అలా ప్రచారమైతే జరుగుతోంది, కానీ నిజం దేవుడెరుగు. సాక్షి టీవీ చానెల్ లో జగన్ వార్తలు వస్తే తన చానెల్ తనను ఫోకస్ చేసుకోకపోతే ఎవరిని ఫోకస్ చేస్తారనే అభిప్రాయం వస్తుందని కావచ్చు, ఆ రెండు టీవీ చానెళ్లలో పెట్టుబడులు పెట్టి జగన్, ఆయన అంకుల్ తమాషా చేస్తున్నారని అంటున్నారు.