కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కే కాకుండా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి కూడా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లాస్ట్ చాన్స్ ఇవ్వదలుచుకున్నారు. ఆ అవకాశం వైయస్ వర్దంతి రోజు జరిగే రాయబారమే కావడం విశేషం. ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ కు చివరి అవకాశం ఇవ్వాలని సోనియా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆమె మొయిలీని రాయబారిగా జగన్ వద్దకు పంపింది. ఆయన ఇడుపులపాయలో జగన్ తో సంప్రదింపులు జరుపుతారు. ఓదార్పు యాత్రను ఆపాలని ఆయన నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మొయిలీ మాట జగన్ వింటారా అనేది సందేహమే అయినప్పటికీ ఆయనకు చివరి వరకూ అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి పనికి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. జగన్ కు నచ్చజెప్పలేని స్థితిలో మొయిలీని కూడా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. మొయిలీ జగన్ కు అనుకూలంగా ఉంటూ వస్తున్నారనే అభిప్రాయం సోనియాకు ఉంది. దీంతో ఇప్పటికే జగన్ వ్యవహారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ అమలు చేస్తూ వస్తున్నారు. జగన్ వ్యవహారాల ప్రభావం మొయిలీపై కూడా పడే అవకాశం ఉంది. చేసుకున్నవారికి చేసుకున్నంత అని అందుకే అంటారు.