ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్టానికి కె. రోశయ్యనే చివరి ముఖ్యమంత్రి అవుతారనే మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, అది కూడా 2011లోనే రాష్ట్రం ఏర్పడుతుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా అంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి రోశయ్యనే అవుతారని అంటున్నారు. కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అదే మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, చివరి ముఖ్యమంత్రి రోశయ్యనే అవుతారని ఆయన సోమవారం ఢంకా బజాయించి చెప్పారు. వైయస్సార్ లాంటి బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర విభజన కష్టమవుతుందని, తాము చెప్పినట్లు వినే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ ప్రక్రియ సులభమవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోందట. అందుకే, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను పక్కన పెట్టి రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నట్లు వినికిడి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే కాంగ్రెసు తెలంగాణ నాయకులు రోశయ్యను ముఖ్యమంత్రిగా సమర్థిస్తూ ఆయనకు అండదండలు అందిస్తున్నారని అంటున్నారు. ఏమో, ఎవరి భాష్యాలు వారు చెప్పుకుంటారు. పరిస్థితి ఎటు మళ్లి ఎటు తిరుగుతుందో చెప్పలేం.