వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అవుతారనే ప్రచారం జరుగుతోంది. తమ ఓటు బ్యాంక్‌కు చిరంజీవి ఇమేజ్ కలిసి వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించేందుకే చిరంజీవితో స్నేహహస్తం చాచినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనం జరగదని, ప్రజారాజ్యం ప్రభుత్వంలో చేరుతుందని అంటున్నారు. ఆ స్నేహాన్ని విలీనం దిశగా నడిపించాలనేది చిరంజీవి లక్ష్యమని అంటున్నారు. అకస్మాత్తుగా విలీనం చేస్తే తనపై వ్యతిరేకత రావచ్చునని, పదవుల కోసమే విలీనం చేశారనే అభిప్రాయం బలపడవచ్చునని చిరంజీవి అనుమానిస్తున్నట్లు సమాచారం. దానికితోడు, పార్టీ క్యాడర్ కొంత మేరకు విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రస్తుతానికి మిత్రపక్షంగానే ఉండాలని చిరంజీవి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి విలీనం దిశగా సాగిస్తారని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయాలు ఆ దిశగానే సాగుతున్నాయని అంటున్నారు.