తెలుగుదేశం పార్టీలో తెలంగాణ తమ్ముళ్లు చాలా మంది తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముకున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా నాగం జనార్దన్ రెడ్డి చురుకైన పాత్ర పోషించకుండా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేయాలన్న డిమాండ్‌ను కూడా క్రమంగా నీరు గార్చారు. తెలంగాణలో నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం పేరిట ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఉద్దేశంతో వారు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే నాగం జనార్దన్ రెడ్డి ప్రయత్నాలను సాగనివ్వడం లేదని అంటున్నారు. చంద్రబాబు తలలో నాలుకలా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు నాగం పక్కన ఉన్నట్లే ఉంటూ చెక్ పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, చంద్రబాబు తెలంగాణ నేతలతో విడివిడిగా సమావేశమవుతూ తెలంగాణ నేతలు ఏకం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.