విశాఖ 'రియల్'లో తెలంగాణ వారి హవా!
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఎప్పటికైనా పలు రాష్ట్రాలుగా విడిపోతుందనే భావన అందరిలోనూ తయారయింది. దీనిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా సొమ్ము చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం బలపడిన నేపథ్యంలో విశాఖపట్నంలో రియల్ బూమ్ బాగా పెరిగిపోయింది. విశాఖ పరిధిలోని కూర్మపాలెం, బిమీలి, పెందుర్తి, కొత్తవాడ తదితర ప్రాంతాలలో భూమి రేట్లు బాగా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు వందల ఎకరాల కొద్దీ భూములు కొని వాటిని ఫ్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. అయితే విశాఖలో భూములు కొంటున్న వారిలో 30 శాతం మాత్రమే స్థానికులని తెలుస్తోంది. మరో ఇరవై శాతం మంది ఇతర రాష్ట్రాల వారు కాగా, మరో ముప్పై శాతం మంది ఇతర జిల్లాల నుండి వచ్చి కొంటున్నారు. అయితే ఇందులో ఇరవై శాతం వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే భూములను కొంటున్నట్లుగా తెలుస్తోంది.

విశాఖలో ప్లాంట్లు, పరిశ్రమలతో పాటు నౌకాయాన వ్యాపారాలు ఉన్నాయి. వీటికి తోడుగా ఐటి సంస్థలు విశాఖను ఐటి హబ్‌గా పేర్కొంటున్నాయి. దీంతో అక్కడ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. హైదరాబాదులో క్రమంగా ధరలు తగ్గుతుంటే ఇక్కడ పెరుగుతున్నాయి. అయితే తెలంగా బూచి చూపి భూముల ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా తిరుపతిలో సైతం భారీగానే రియల్ దందా పుంజుకుంటోందంట. కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వేంకటేశ్వరుడితో పాటు రాష్ట్రం విడిపోతే తిరుపతి రాజధానిగా అయ్యే ఆస్కారం సైతం ఉందనే వాదనల నేపథ్యంలో అక్కడ రియల్ వ్యాపారం భారీగా సాగుతోందంట. భారీ విమానాశ్రయం కారణంగా ఒంగోలులోనూ ఒకప్పుడు లక్షలు పలికిన భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయంట.












Click it and Unblock the Notifications