డాన్ కాబోయి ఖైదీ అయిన భాను కిరణ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుగాంచిన మంగళి కృష్ణతో భానుకి అవినాభావ సంబంధం ఉండేదని, అతని ద్వారా సేకరించిన ఆయుధంతోనే నిత్యం భాను సంచరించేవాడట. కృష్ణతో కలిసి అనేక సెటిల్మెంట్లు చేసినట్లు భాను చెప్పారని తెలుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజంపై మనసు పారేసుకున్న భాను ఎలాగైనా డాన్ గా ఎదగాలనుకున్నాడట.
భాను చదువుకునే రోజుల్లోనే సెటిల్మెంట్లలో ఆరితేరాడని విచారణలో తేలిందని తెలుస్తోంది. 2000 సంవత్సరంలోనే భాను అనంతపురం చుట్టుపక్కల భూదందాలు చేసేవాడని తెలుస్తోంది. ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసే కుంభకోణానికి భానుయే ఆధ్యుడట. ఆ తర్వాత పలువురితో భాను పరిచయాలు పెరిగాయి.
2005లో చర్లపల్లి జైలులో ఉన్న సూరిని కలిసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత సూరితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మంగళి కృష్ణతో కూడా సూరికి పరిచయం ఉండటంతో అది భానుతో ఫ్రెండ్ షిప్‌కు దారి తీసింది. ఆ తర్వాత్తర్వాత సూరిపై కక్ష పెంచుకున్న భాను చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. సూరి కోసం ఎంత పనికైనా వెనుకంజ వేయని భాను, ఆ తర్వాత అతనిపై కక్ష పెంచుకొని 2011 జనవరి 3న దారుణంగా హత్య చేశాడు.
హత్య అనంతరం చాలా రాష్ట్రాలు తిరిగి చివరకు మధ్యప్రదేశ్‌లో సెటిల్ అయ్యాడు. సూరిని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సుబ్బయ్య, మన్మోహన్ సింగ్‌తో భాను చెప్పాడట. ధర్మవరంలో ఓ గ్యాంగ్‌తో సెటిల్మెంట్లు ప్రారంభించిన భాను డాన్ స్థాయికి ఎదగాలనుకొని ఖైదీ అయ్యాడు. అతను ఎప్పటికప్పుడు గ్యాంగ్‌లను మారుస్తుండేవాడట.
సూరి పేరును అడ్డం పెట్టుకుని భాను చేసిన పదుల్లో ఉన్నాయని అంటున్నారు. మంగలి కృష్ణ, హోం మంత్రి తనయుడు కార్తీక్ రెడ్డికి మిత్రుడిగా చెప్పబడుతున్న ప్రదీప్ రెడ్డి భాను సెటిల్‌మెంట్లలో కుడిఎడమలుగా ఉన్నట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. సుమారు 50కి పైగా నేరాలకు భాను ముఠా పాల్పడినట్లు సిఐడి గుర్తించారని తెలుస్తోంది. ఇప్పటికి 16 కేసులు నమోదయ్యాయి. భాను ఈ స్థాయికి ఎదగడం వెనుక కృష్ణ, ప్రదీప్ రెడ్డి తదితరులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తోంది.
సెటిల్‌మెంట్లు చేయడానికి భాను ముఠాకు కృష్ణ ఆయుధాలు అందించాడని సిఐడి అధికారులు చెప్పారు. సెటిల్‌మెంట్ల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బుతో సూడాన్‌లో కేబుల్ వ్యాపారమే కాక, ఒక రాష్ట్రంలో మినీ హైడల్ పవర్ ప్లాంట్‌లోనూ భాను ముఠా పెట్టుబడులు పెట్టినట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. సూరి హత్య తర్వాత భాను షోలాపూర్, పుణె, ముంబై మీదుగా గుర్గావ్‌కు వెళ్లి అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని సియోనిలో మకాం వేసిన విషయం ఇప్పటికే స్పష్టమైంది.
బెదిరింపులు, కబ్జాలు, అక్రమాయుధాలు, వసూళ్లు, హత్యల వంటి నేరాలకు పాల్పడిన తనకు కడప జిల్లాకు చెందిన మంగలి కృష్ణ పూర్తి సహకారం అందించాడని సిఐడి పోలీసులకు భాను కిరణ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2002 నుంచి 2010 వరకూ తాను చేసిన నేరాల గురించి సిఐడి అధికారులకు పూసగుచ్చినట్లు వివరించాడట.
కడప జిల్లాకు చెందిన భాను కిరణ్ చిన్నప్పుడే అనంతపురంలో సెటిలయ్యాడు. అక్కడ పాలిటెక్నిక్ చదువుతుండగా లోక్‌నాథ్, జమ్మలమడుగు కదీర్ పరిచయమయ్యారు. వీరి సాయంతో కంప్యూటర్‌పై పట్టుసాధించి 2003లో ఇంటర్నేషనల్ కాల్స్‌ను నెట్ ద్వారా లోకల్‌కాల్స్‌గా మార్చి డబ్బు సంపాదన ప్రారంభించాడు. అక్కడి నుంచి మొదలైన తప్పుడు మార్గం సూరి హత్య వరకు కొనసాగింది.
2004లో సూరికి భాను దగ్గరయ్యాడు. సూరి ఆదేశాల మేరకు అతని ప్రత్యర్థులను అంతం చేసేందుకు పులివెందులకు చెందిన కృష్ణ దగ్గర ఆయుధాలు తీసుకున్నాడు. నాటు తుపాకి, రైఫిల్ ఇలా మొత్తం ఐదు ఆయుధాలు కృష్ణ తనకు ఇచ్చినట్లు సిఐడి అధికారుల ముందు భాను అంగీకరించాడు. వీటిలో రెండు ఆయుధాలను తన వద్దే ఉంచుకొని, మిగిలిన మూడింటిని జమ్మలమడుగు మండలం కొండాపురంలో దాచి, అవసరానికి తెచ్చుకునేవాడు.
హైదరాబాద్‌కు చెందిన షాలిమార్ వీడియోస్ యజమానిని, సినీ ఫైనాన్షియర్ వైజయంతిని ఈ ఆయుధాలతోనే బెదిరించినట్లు తెలిపాడు. వీటిలో ఒకటి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సియోనిలో ఉన్నట్లు చెప్పాడు. 2006లో ధర్మవరానికి చెందిన ప్రసాద్ తదితర 11 మందితో సెటిల్‌మెంట్లు చేశాడు. యర్రంపల్లికి చెందిన మధుమోహన్, అనంతపురానికి చెందిన సుబ్బయ్య, మద్దెలచెర్వు సూరి సోదరి హేమలతా రెడ్డితో కలిసి సెటిల్‌మెంట్ల దందాకు జోరు పెంచాడు.
సినీ ఫైనాన్షియర్ శింగనమల రమేష్, సి.కళ్యాణ్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో దందా మొదలు పెట్టాడట. ఇక్కడ అనేక సెటిల్‌మెంట్లు చేసిన భాను ఆ డబ్బుల్లో సింహభాగం సూరి కేసుల కోసం ఖర్చు చేశాడు. సూరిని ఎలాగైనా హత్య కేసు నుంచి తప్పించాలని, లేదా శిక్ష తగ్గించాలని సూరి సోదరితో కలిసి ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీకాంత్ గౌడ్ ద్వారా యూపికి చెందిన సెక్యూరిటీ గార్డు మన్మోహన్ సింగ్ పరిచయమయ్యాడు.
అతనివద్ద లైసెన్స్‌డ్ ఆయుధం ఉండటంతో తనకు అంగరక్షకుడిగా నియమించుకొని సెటిల్‌మెంట్లకు ఉపయోగించుకున్నాడు. కొందరిని బెదిరించి భూకబ్జాలకు పాల్పడ్డాడు. సూరి జైలు నుంచి విడుదలయ్యాక తన పేరు చెప్పుకొని భాను సెటిల్‌మెంట్లు చేసి సంపాదించిన సొమ్మును తనకు తెలియకుండా దాచాడని అనుమానించి, అడగటం మొదలు పెట్టాడు. దీంతో సూరి హత్యకు ప్లాన్ చేశాడు.












Click it and Unblock the Notifications