గల్ఫ్‌లోనూ..: ఎల్లలు దాటిన ఉపపోరు వేడి

నేతల మాటలను బట్టి చూస్తుంటే దేశంలో జరుగుతున్న ఇతర ఉప ఎన్నికల నియోజకవర్గాల కంటే మన రాష్ట్రం పైనే దేశవ్యాప్తంగా అందరూ దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకొని.. దేశంలో అత్యంత ప్రభావశీలురాలైన సోనియా గాంధీని ఎదిరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును ఈ ఉప ఎన్నికలు తేల్చుతాయని అందరూ భావిస్తున్నారు. దేశంలోని కాంగ్రెసు అనుకూల, వ్యతిరేక పార్టీలు కూడా దీనిని గమనిస్తున్నాయి.
అయితే ఉప ఎన్నికల వేడి కేవలం రాష్ట్రానికి లేదా మన దేశానికే పరిమితం కాలేదు. ఉప ఎన్నికల ప్రచారం వేడి గల్ఫ్‌ను కూడా తాకింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలపై గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంద్రులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ కువైట్‌లో సభ నిర్వహించారు. ఈ మూడు నియోజకవర్గాల్లోని దాదాపు ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో కువైట్, సౌదీ అరేబియాకు వచ్చినవారున్నారు.
వీరంతా స్వదేశంలో తమ కుటుంబ సభ్యుల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఇక్కడ సభ నిర్వహించి, ఆకట్టుకునేందుకు యత్నించారు. అలాగే నెల్లూరు లోక్‌సభ పరిధిలోని నెల్లూరు అర్బన్, కావలి, ఉదయగిరితోపాటు తిరుపతి, అనంతపురం, నరసాపురం నియోజకవర్గాల ఓటర్లూ పెద్దసంఖ్యలో ఉన్నారు. కువైట్‌లో జగన్ అభిమానుల సభ తర్వాత రాజంపేట కాంగ్రెస్ అభ్యర్థి మేడ మల్లికార్జున్ రెడ్డి, మంత్రి అహ్మదుల్లా కూడా సభ ఏర్పాటుకు యత్నించారు.
ఇక తిరుపతి బరిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం కోసం సౌదీ, కువైట్‌ల నుంచి వెళ్లిన అభిమానులు కొందరు శనివారం తిరుపతిలో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సౌదీలోని రియాద్, మక్కాలలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ముర్షిదా బేగం భర్తపై ఆగ్రహం వల్ల వారు ఆమె గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఇక నరసాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుబ్బ రాయుడు భవితవ్యం పైనా ఆ ప్రాంత ప్రవాసులలో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications