కాంగ్రెసు నుంచి రాజ్యసభకు రేణుకా చౌదరి, చిరంజీవి వెళ్లడం ఖాయమైనట్లు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ ఆరు సీట్లలో కాంగ్రెసు నాలుగు సీట్లను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ నాలుగింటిలో చిరంజీవికి, రేణుకా చౌదరికి రాజ్యసభ సీట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడో సీటును ప్రముఖ వాణిజ్యవేత్త జివికె రెడ్డికి ఇప్పించడానికి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. నాలుగో సీటు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెసుకు చెందిన నలుగురి పదవీ కాలం ముగుస్తోంది. దాసరి నారాయణరావు, జి. సంజీవ రెడ్డి, రషీద్ అల్వీ, కె. కేశవరావు పదవీ కాలం ముగుస్తుండడంతో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ నలుగురిలో ఎవరిని కూడా రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా లేరని అంటున్నారు. అయితే, రషీద్ అల్వీ విషయంలో అధిష్టానం గట్టిగా ఉంటే షబ్బీర్ అలీకి కోత పడవచ్చునని అంటున్నారు. ఏమైనా, చిరంజీవి వల్ల దాసరికి, తెలంగాణ ఉద్యమం వల్ల కె. కేశవరావుకు తిరుగు టపా తప్పడం లేదని అంటున్నారు.