లిక్కర్ డాన్: దూరం జరిగిన బొత్స

బొత్సకు బినామీ పేర్ల మీద చాలా మద్యం దుకాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బంధువులు, పని మనుషులు తదితరుల పేర్ల మీద ఆయనకు దుకాణాలు ఉన్నట్లుగా విమర్శలు వచ్చాయి. అప్పుడు ఆయన ప్రతిష్ట బాగా దెబ్బతిన్నది. అంతేకాదు ఎప్పుడూ లేనంతగా మద్యం సిండికేట్‌పై ఎసిబి దాడులు కూడా నిర్వహించింది. బొత్సను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ దాడులు చేయించినట్లుగా వ్యాఖ్యలు వినిపించాయి.
ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న బొత్సను రాజకీయంగా దెబ్బతీసేందుకు కిరణ్ అలా చేశారనే ప్రచారం జరిగింది. మద్యంపై దాడుల విషయంలో వీరి విభేదాలు అధిష్టానం వరకు చేరాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అధిష్టానం కల్పించుకోవడంతో బొత్స బయట పడ్డారు. అయితే మరోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకోవాలని బొత్సకు సూచించిందట. ఈ విషయంలో సొంత పార్టీ నుండి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బొత్సకు ప్రతిపక్షాల నుండి కూడా ఘాటైన విమర్శలే వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఏకంగా బొత్సకు మద్యం దుకాణాలు ఉన్నాయని, అవి బినామీ పేర్లతో ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన సొంత జిల్లా విజయనగరంలో ధర్నా చేపట్టారు. టిడిపి నేతలు బొత్సను లిక్కర్ డాన్‌గా అభివర్ణిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలా ఇంటా, బయటా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మద్యం వ్యాపారానికి దూరంగా ఉండటమే మంచిదని భావించి, ఇటీవల టెండర్లకు దూరంగా ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications