జయప్రదకు తలుపులు తెరవని టిడిపి

తెలుగుదేశం పార్టీలో చేరడానికి జయప్రద ఉవ్విళ్లూరుతున్నా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తలుపులు ఆమె కోసం ఇంకా తెరుచుకోలేదని పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి మాటలను బట్టి అర్థమవుతోంది. తమ పార్టీలో చేరడానికి జయప్రద ఇంకా దరఖాస్తు చేసుకోలేదని, తమ వద్ద అటువంటి దరఖాస్తు లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జయప్రద ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవడం అవసరమా, ఇదేం డొంక తిరుగుడనేది అర్థం కావడం లేదని అంటున్నారు.
నిజానికి, తెలుగుదేశం పార్టీలో జయప్రద ఒక వెలుగు వెలిగారు. ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేశారంటూ ఆమె పార్టీని వీడి రాష్ట్రం గాని రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు తరలిపోయారు. అక్కడ పరిస్థితులు తిరగబడ్డాయి. దీంతో ఆమె తిరిగి రాష్ట్రం వైపు చూస్తున్నారు.
జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్యమైన అడ్డంకి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దేవి అని అంటున్నారు. ఆమెను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఆమెకు ఇష్టం లేదట. చంద్రబాబుపై జయప్రద చేసిన విమర్శలే అందుకు కారణమని అంటున్నారు. ఏమైనా, జయప్రద జాతకం ఎలా ఉందో చూడాలి.












Click it and Unblock the Notifications