కాంగ్రెసు ప్లాన్: జగన్‌తో కిరణ్ రెడ్డికి కౌంటర్?
హైదరాబాద్: బెయిల్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు నుంచి విడుదల కావడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మింగుడు పడని వ్యవహారంగా మారినట్లు కనిపిస్తోంది. జగన్ విడదులతో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కొంత మంది సీమాంధ్ర నాయకులు రచిస్తున్న వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం దెబ్బ కొట్టినట్లు భావిస్తున్నారు. సీమాంధ్రలో కొత్త పార్టీ వస్తుందనే గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, కాంగ్రెసు వీరశివా రెడ్డి మాటలను నీటి మూటలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో సమైక్యాంధ్ర పార్టీని పెట్టించాలని కాంగ్రెసులోని ఓ వర్గం కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర చాంపియన్‌గా నిలిచేందుకు అవసరమైన వ్యూహరచన చేసుకున్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ జైలు నుంచి విడుదల కావడం ఆ వర్గానికి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని అంటున్నారు.

సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకున్న వైయస్ జగన్ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడమే కాకుండా కాంగ్రెసుపై తిరగబడడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నాయకులకు కూడా కళ్లెం వేసినట్లుగా భావిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు పార్టీలో కొనసాగడమో, జగన్ పార్టీలో చేరడమో చేయాల్సిన స్థితిలో పడ్డారని అంటున్నారు.
వైయస్ జగన్ సమైక్య నినాదం వల్ల రాష్ట్ర విభజనకు మార్గం సులభమవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసులోని సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తే కాస్తా ఇరకాటంలో పడాల్సిన స్థితి ఏర్పడేది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి జగన్ కారణంగా ఇతర నాయకులకు సాధ్యమయ్యే పని కాదు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి చెక్‌గానే జగన్ పనిచేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications