ఇప్పటికీ సోనియాను ఒప్పుకోని సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలన్న యోచనను తాను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నానని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గురువారం చెప్పారు. సోనియా మన దేశానికి దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ భార్యగా వచ్చారని చెప్పారు.
ఆ కారణంగా ఆమె భారతీయుల ప్రేమను, వాత్సల్యాన్ని పొందవచ్చునని, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిగా మన గౌరవాన్ని పొందవచ్చునని అయితే, ప్రధాని కావాలనుకుంటే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని చెప్పారు. తద్వారా మరోసారి సోనియా విదేశీ అంశం చర్చకు వచ్చింది.

కాగా, సోనియా గాంధీ ప్రధాని అయితే తాను శిరోముండనం చేయించుకుంటానని సుష్మా స్వరాజ్ 2004లో ప్రతిజ్ఞ చేశారు. తన ప్రతిజ్ఞ పైన ఆమె క్షమాపణలు చెప్పేందుకు సిద్ధపడలేదు.
భారత దేశం 150 ఏళ్లు పరాయి పాలనలో ఉందని, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని ఉటంకించారు. స్వాతంత్రం వచ్చిన అరవయ్యేళ్ల తర్వాత ఇప్పుడు దేశంలోని అత్యున్నత స్థానం పైన విదేశీయులను కూర్చోబెట్టడమంటే వంద కోట్ల ప్రజలకు అవమానమేనని, ఇది అందరినీ బాధిస్తుందని సుష్మా స్వరాజ్ అప్పుడు అన్నారు.












Click it and Unblock the Notifications