విద్యా బాలన్ లాగే ఐపీఎల్: బిషన్ సింగ్ బేడీ
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ చూపులు సినీ నటి విద్యా బాలన్ పై పడినట్లున్నాయి. అందుకేనేమో విద్యా బాలన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధం ఉందంటున్నారు బిషన్ సింగ్ బేడీ. అదెలగంటే విద్యాబాలన్ సినీ ప్రియులకు ఏ విధంగానైతే వినోదాన్ని పంచుతుందో..అదే విధంగా ఐపీఎల్ కూడా క్రికెట్ ప్రియులకు వినోదాన్ని పంచుతోందని బిషన్ సింగ్ బేడీ అంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ దేశీయ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తోందని ఆయన అన్నారు. ఐపీఎల్ దేశంలోని కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోందని తెలిపారు. అయితే క్రికెట్‌కు ఆస్తుల్లాంటివైన టెస్ట్ మ్యాచ్‌లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ క్రీడాకారులకు పునాది వేస్తుందని తెలిపారు. తమ కాలంలో రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు చాలా ప్రాచూర్యం పొందాయని తెలిపారు.

అయితే రంజీ మ్యాచ్‌లకు ప్రస్తుతం తగిన ఆదరణ లభించడం లేదన్నారు. వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించకపోవడం సరికాదన్నారు. విద్యా బాలన్ అంటే వినోదం..అలానే ఐపీఎల్ అంటే కూడా వినోదమేనని మరోమారు ఆయన చెప్పారు.
క్రికెట్‌లో బౌలర్ల దూస్రాలపై మాట్లాడుతూ..బౌలింగ్‌లో దూస్రాలు..తీస్రాలూ అవసరం లేదని సరిగ్గా బౌలింగ్ చేస్తే చాలన్నారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్..మంచి ఫాంలో ఉన్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్థాయిని చేరుకోవాలన్నారు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు అశ్విన్ బాధ్యతగా వ్యవహరిస్తాడని, వికెట్లు తీయడంలో ముందుంటాడని చెప్పారు. అశ్విన్ భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అన్నారు.
ఆరేళ్ల క్రితం నీరసంగా ఉన్నటువంటి భారత క్రికెట్..ఐపీఎల్ ప్రవేశంతో ఉత్సాహంతో ఉరకలు పెట్టిందని భారత మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆధిపత్యం కొనసాగుతున్నా టెస్ట్ క్రికెట్టే వాస్తవమైన ఆట అని అన్నారు. ఐపీఎల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆటని, క్రికెట్ అభిమానులను ఐపీఎల్ విశేషంగా ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications