దాడి 'లెక్క' ఫిరాయింపు: టిడిపి ముక్కున వేలు?

ప్రధానంగా ఓ సంఘటనపై టిడిపిలో చర్చ సాగుతుందట. సీమాంధ్రలో ఉప ఎన్నికలు జరిగిన సమయంలో... వైయస్ తన హయాంలో ఎన్ని వేల ఎకరాల భూములను బడా బాబులకు పందేరం చేశారనే సమాచారాన్ని టిడిపి సేకరించింది. దీనిని వివరిస్తూ ఒక మ్యాప్ తయారు చేయించింది. మీడియాకు ఆ అంశాలను వివరించే బాధ్యతను దాడికి అప్పగించారు. ఆ భూముల వివరాలు మాత్రమే చెప్పాలని సూచించారు.
దాడి మాత్రం ఆ భూముల విలువను లెక్క కట్టారట. పందేరం చేసిన భూముల విలువ రూ.16 లక్షల కోట్లు ఉంటుందని తేల్చారట.భూమి విలువ జోలికి పోవద్దని పార్టీ చెప్పినా ఆయన వినలేదట. తనపై క్రమశిక్షణ చర్య తీసుకున్నా ఫర్వాలేదని, తాను మాత్రం ఆగేది లేదన్నారట. వైయస్ అవినీతిపై లెక్క కట్టి మరీ చెబుతానన్నారట. ఆ రోజు తాము వద్దని వారించినా భూముల విలువ గురించి ప్రస్తావించారని టిడిపి నేతలు చెప్పుకుంటున్నారట.
అప్పుడు వద్దన్నా ఆ భూములకు లెక్క కట్టి.. ఇప్పుడు మాత్రం పార్టీ మాట్లాడమంటేనే మాట్లాడానని చెప్పడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అంతటి సీనియర్ కూడా ఇలా ప్లేటు తిప్పేస్తారని అనుకోలేదని టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పార్టీ మారటం పక్కన పెడితే తాను చేసిన వ్యాఖ్యలపై కూడా ప్లేటు ఫిరాయించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారట.
స్వర్గీయ నందమూరి రామారావు స్ఫూర్తితో దాడి రాజకీయాల్లోకి వచ్చారని, ముప్ఫై ఏళ్లలో ఒక స్థాయికి ఎదిగారని, పదవులు రావచ్చు పోవచ్చునని, ఈ వయసులో పార్టీ మారి జైలులో ఉన్న నాయకుడి వద్దకు సీటు కోసం వెళ్లడం బాధాకరమని, చెన్నమనేని రాజేశ్వర రావు, దేవేందర్ గౌడ్ వంటి సీనియర్లు ఇలాగే పార్టీలు మారితే ప్రజలు ఆమోదించలేదని గుసగుసలాడుకుంటున్నారట.












Click it and Unblock the Notifications