చంద్రమోదీ యూత్: బాబు, మోడీల పోస్టర్లు
గుంటూరు: తెలుగుదేశం, బిజెపిలకు మధ్య పొత్తు కుదురుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్న స్థితిలో అందుకు అనుగుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేర్లతో పోస్టర్లు వెలిశాయి.
చంద్రమోడీ యూత్ పేరుతో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. "చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దాం...రాష్ట్రాన్ని కాపాడుదాం, నరేంద్ర మోడీనని ప్రధాని చేద్దాం...దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం...ఇది మన సామాజిక అవసరం" అంటూ పోస్టర్లపై వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పోస్టర్లు రాష్ట్రంలో కొత్త పరిణామాన్ని సూచిస్తున్నాయి.

నరేంద్ర మోడీ హైదరాబాద్ సభతో బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య దోస్తీ కుదరవచ్చుననే పుకార్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అందుకు అనుగుణంగానే పరిణాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వేదికను పంచుకున్నారు. అంతేకాకుండా, మోడీ గుజరాత్ పాలనను ఆయన మెచ్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ బిజెపి వైపు మొగ్గు చూపుతున్న సూచనలు గత కొంత కాలంగా స్ఫష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని తాజాగా బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుతో విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. చివరకు బిజెపిలో చేరారు.












Click it and Unblock the Notifications