జగన్ సభకు 'భారీ'గా..: ప్రభుత్వాల సహకారమా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సభకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎంత ఖర్చు పెట్టినా స్టేడియం నిండలేదని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో వైయస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య శంఖారావం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఆ పార్టీ వ్యయం చేసిందట. పదమూడు జిల్లాల నుండి పదహారు వందల ఆర్టీసి బస్సులను అద్దెకు తీసుకుంది. కిలోమీటరుకు రూ.38 చొప్పున ఆర్టీసి అద్దె రూపంలో వసూలు చేసింది. అన్ని బస్సులకు కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా అయిందంటున్నారు.

సీమాంధ్ర జిల్లాల్లో నుండి వచ్చేందుకు పదిహేను రైళ్లను బుక్ చేశారు. అందులో ఓ రైలు చివరి నిమిషంలో రద్దయినా పద్నాలుగు రైళ్లు వచ్చాయి. వీటికి అద్దె రూపంలో కోటికి పైగా చెల్లించారట. నగరంలో పలు ఫంక్షన్ హాళ్లను కూడా ముందే బుక్ చేసుకున్నారు.
మరోవైపు జగన్ సభ పైన టిడిపి మండిపడుతోంది. వరదల్లో సర్వం కోల్పోయి ప్రజలు అల్లాడుతుంటే వందల కోట్లు ఖర్చు చేసి సభ పెట్టడం మానవత్వమా? 40 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు చంద్రబాబును తిట్టడానికే సభ పెట్టావా అని, 200 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఈ సభలో పావలా వంతు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, రెండు కోట్లు తనకిస్తే ఇంతకన్నా పెద్ద సభ పెట్టి చూపిస్తానని టిడిపి నేత సోమిరెడ్డ చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు.
జగన్ సభను విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేశాయని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సభకు 20 రైళ్లు ఇచ్చారని, చంద్రబాబు దీక్షకు ఢిల్లీకి రెండు రైళ్లు అడిగితే ఒకటిచ్చిన నాలుగు రోజుల తర్వాతగానీ రెండోది ఇవ్వలేదని, వాటిని కూడా అనేక చోట్ల ఆపి, రెండున్నర రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లనిచ్చారని ఆరోపించారు. జగన్ సభకు సహాయం అందించడం ద్వారానే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడుతోందన్నారు.












Click it and Unblock the Notifications