ట్విస్ట్: 'డబ్బులిచ్చి మోడీని పొగిడించారు'

కొంతమంది అమెరికన్ వ్యాపారులతో కలిసి కాంగ్రెస్ సభ్యులు ఆరాన్ ఛోక్, సింథియా ల్యూమీస్, కాథీ ఎమ్ రోడ్జర్స్ కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నారు. వీరి ఖర్చులను అమెరికాలోని షికాగోకు చెందిన ఎన్ఐఎపిపిఐ (నేషనల్ ఇండియన్ అమెరికన్ పబ్లిక్ పాలసీ ఇండస్ట్రీస్) భరిస్తున్నది. అయితే, ఈ పర్యటన అసలు ఉద్దేశం మోడీ అమెరికా ప్రభుత్వం దృష్టిలో పడేలా చేయడం, తద్వారా వీసా తదితర అడ్డంకులను తొలగించడమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
దీని కోసం ఒక్కో సభ్యుడికి తొమ్మిది లక్షల దాకా చెల్లించారని ఆ పార్టీ ప్రతినిధి రషీద్ అల్వీ ఆరోపిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ముడుపులు ఇచ్చి గుజరాత్ అభివృద్ధిపై సర్టిఫికేట్ ఇప్పించుకోవడం సిగ్గు చేటు అని, 2002 గోధ్రా అల్లర్ల తరువాత అమెరికా నిలుపుదల చేసిన వీసాను పునరుద్ధరించుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో అమెరికన్ బృందం చిక్కుల్లో పడింది.
తమ పర్యటనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అరోన్ స్కాచ్ చెప్పారు. అమెరికా ప్రభుత్వం అనుమతితోనే తాము భారత్‌కు వచ్చామని వెల్లడించారు. అసలు ఇందులో వివాదం ఏముందని ప్రవాస బిజెపి శాఖ కన్వీనర్ విజయ్ జోలి ప్రశ్నిస్తున్నారు. అమెరికా ఇదంతా మామూలేనని, అధ్యక్షుడితో విందుకు పెద్ద మొత్తంలో చెల్లిస్తుంటారని జోలి పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుల పర్యటనకు నిధులు ఏర్పాటు చేసినమాట నిజమేనని ఎన్ఐఎపిపిఐ వ్యవస్థాపకుడు షలాభ్ కుమార్ తెలిపారు.
ప్రైవేట్ సంస్థల ఖర్చులపై వచ్చి అదేదో అధికార పర్యటన అన్నట్టు వ్యవహరించడం ఏమిటని గుజరాత్ పిసిసి అధ్యక్షుడు అర్జున్ మొద్వాదియా ఆక్షేపించారు. అమెరికా కాంగ్రెసు సభ్యులకు డబ్బులిచ్చారంటూ అమెరికాలోని ఓ భారతీయ పత్రికలో కథనాలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications