ఆ ముగ్గురికి జెపి తోడు: రాత్రి పవన్-బాబు చర్చలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అలయెన్స్ పుట్టుకు రానుంది. ఇప్పటికే బిజెపి, టిడిపిల మధ్య పొత్తు అంతర్గతంగా దాదాపు ఖరారయింది. వారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తోడు కానుంది. మరోవైపు మార్పు పేరుతో వచ్చిన లోక్‌సత్తా పార్టీ కూడా వీరికి జత కలవనుందంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను చిత్తు చేసే వ్యూహంలో భాగంగా టిడిపి, బిజెపి, జనసేనకు లోక్‌సత్తా తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. ఆయన టిడిపికి అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో బిజెపితోను పొత్తుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపించాయి.

పవన్ జనసేన పార్టీ ప్రకటించకముందు పవర్ స్టార్ తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని జెపి చెప్పారు. టిడిపికి బిజెపి తోడు ఆ పార్టీలతో పవన్ చర్చలు, వారికి జెపి అనుకూలంగా ఉండటం... ఇవన్నీ రానున్న ఎన్నికల్లో ఆ నాలుగు పార్టీల పొత్తుకు సంకేతాలు అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోకసభకు పోటీ చేయాలని జయప్రకాశ్ నారాయణ భావిస్తున్నారు. టిడిపి, బిజెపి, జనసేన అంగీకారంతో అది కుదురుతుందని చెబుతున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌తో టిడిపి, బిజెపి నేతలు మాట్లాడుతున్నారట. చంద్రబాబు - పవన్‌ల మధ్య ఆదివారం రాత్రి 9.30 గంటల నుండి పదకొండు గంటల వరకు చర్చలు జరిగాయి. ఒకటి రెండు రోజుల్లో మరో దఫా చర్చలు ఉంటాయంటున్నారు. 2019 టార్గెట్‌గా పెట్టుకున్న పవన్ కళ్యాణ్‌కు పోటీపై ఆసక్తి లేనప్పటికీ కొంతమందిని బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఓట్లరు చీలకుండా చూసేందుకు బిజెపి, లోక్‌సత్తా, టిడిపిలతో పవన్ అవగాహనకు వచ్చే అవకాశముందంటున్నారు.












Click it and Unblock the Notifications